మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి గొర్రెలు, మేకల దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఎస్సై అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక ఇంటి ముందు కర్ణాటక రిజిస్ట్రేషన్ గల కారు ఆగి ఉండటాన్ని గమనించిన గస్తీ పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూడగానే కారులో ఉన్న వ్యక్తి వేగంగా పారిపోయే ప్రయత్నం చేయగా, అప్రమత్తమైన సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.
దొంగ ఆ బారికేడ్లను ఢీకొట్టి రాయిచూర్ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా కారు ఆగిపోయింది. అనంతరం కారు దిగి పారిపోతున్న అతడిని పట్టుకోబోయిన హెడ్ కానిస్టేబుల్ ఉమేశ్ గౌడ్‌ను బలంగా తోసివేసి నిందితుడు చీకట్లోకి పరారయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన ఉమేశ్ గౌడ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్వాధీనం చేసుకున్న కర్ణాటక వాహనం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
