
పరివర్తనా కేంద్రాలు.. పథక రచనకు అడ్డాగా మారుతున్నాయి. రియలైజ్ అవ్వాల్సిన చోట.. రీ చార్జ్ అవుతున్నారు. టెక్నాలజీకి చిక్కకుండా నేరాలు చేసే ‘చిట్కాలు’ ఒడిసిపడుతున్నారు. చిల్లరదొంగలు కాస్తా విడుదలయ్యాక ప్రొఫెషనల్స్ గా మారుతున్నారు. జైళ్లలో కలిసిన పాత నేరస్తుల గత్యంలో రాటుదేలుతున్నారు. విడుదలయ్యాక విజృంభిస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్.. ఇలా కరుడుగట్టిన ముఠాలపై పోలీసులు సీరియస్ గా నజర్ పెట్టేవారు. ఇప్పుడు చిల్లరదొంగలనూ ఓ కంట కనిపెట్టాల్సి న పరిస్థితి వచ్చింది. ఇటీవల సీసీ టీవీకి చిక్కినా.. పోలీసులకు చిక్కడం లేదు కొన్ని గ్యాంగులు! రెండు నెలలుగా పట్టుబడిన దొంగలు విస్తు పోయే విషయాలు వెల్లడిస్తున్నారు. తామూ సాధారణ దొంగలమేనని, జైళ్లలో సీనియర్ దొంగల పుణ్యాన చోరీల్లో మెళకువలు నేర్చుకున్నామని చెబుతున్నారు.
దోస్తీ కుదురుతోందిలా..
చిన్నచిన్న చోరీలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్ చేసిన వారు జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటారు. అక్కడ ఒకేరకం నేరం చేసిన వారి మధ్య భావసారూప్యత కుదురుతోంది. ఇది స్నేహంగా మారుతోంది. ఇలాంటి స్నేహాలు వీరిని వృత్తిపరంగా బలోపేతం చేస్తున్నాయి! చోరీల్లో మెళకువలు నేర్పుతున్నాయి. పారిపోవడంపై పట్టు పెంచుతున్నాయి. ఒకేరకం చోరీలు చేసిన వారు జట్టుకట్టి గతంలో తాము చేసిన లోటుపాట్లపై చర్చిస్తున్నారు. ఫ్యూచర్ కు పకడ్బందీ ప్లాన్స్ వేస్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కినా పోలీసుల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో నేర్చుకుంటున్నారు. అయితే, ఇక్కడ మెళకువలు నేర్పేది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కో కేస్ స్టడీ మతి పోగొడుతోంది.
ఎల్బీనగర్ దొంగలు.. నోయిడా జైల్లో మిత్రులు
ఎల్బీనగర్ శివారు ప్రాంతాల్లో వరుస స్నాచింగులతో హడలెత్తించిన దొంగలు వయా నోయిడా జైలు నుంచి వచ్చినవారే. చింతమల్ల ప్రణీత్ కుమార్ చౌదరి చోరీ కేసులో నోయిడా జైలుకెళ్లాడు. అక్కడ మోను వాల్మీకి, చోకలతో పరిచయమైంది. వీరు దేశవ్యాప్తంగా 150 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ దొంగలు. ప్రణీత్ కుమార్ ను టీమ్ లో చేర్చుకుని హైదరాబాద్ పరిస్థితులు తెలుసుకున్న ఆ ఇద్దరూ చోరీకి ఆర్నెళ్ల ముందే జైల్లో స్కెచ్ వేశారు. ప్రణీత్ విడుదలై సిటీకి వచ్చాడు. తర్వాత విడుదలైన మోను వాల్మీకి, చోకలు.. ప్రణీత్ చెప్పినట్లు డిసెంబర్ 24న హైదరాబాద్ చేరారు. ఓఎల్ఎక్స్ లో కేటీఎం బైక్ తీసుకోవడం నుంచి స్వల్ప వ్యవధిలో స్నాచింగ్ చేసి ఎస్కేప్ అవడం వరకు జైలు ప్లాన్ ప్రకారమే చేశారు.
కర్రి సత్తి గ్యాంగ్ కట్టాడిలా..
తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడులో వరుస చోరీలు చేస్తున్న కర్రి సతీష్ అలియాస్ కర్రి సత్తి కూడా జైల్లోనే గ్యాంగ్ కట్టాడు. ముందుగా కార్లు దొంగిలించి వాటిలోనే చోరీయాత్ర సాగించడం ఈయన స్టైల్. వారానికో రాష్ర్టం తిరుగుతూ అక్కడి ప్రముఖుల ఇళ్లలో విలువైన ఆభరణాలు దోచుకెళ్తుంటాడు. 77 కేసుల్లో కర్రి సత్తి నిందితుడు. 2016 డిసెంబర్ లో కర్రి సత్తిని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీ యాక్టు కూడా పెట్టి ఏడాది జైల్లోనే ఉంచారు. ఆ సమయంలో.. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తున్న పచ్చపాటి శ్రీనివాస్, నూనవత్ నరేందర్ నాయక్ తో కర్రి సత్తికి దోస్తీ కుదిరింది. ముగ్గురూ ముఠాగా మారి చోరీలకు స్కెచ్ గీశారు. పీడీ రిమాండ్ కాలం ముగిశాక కర్రిసత్తి, తర్వాత శ్రీనివాస్, నరేందర్ నాయక్ విడుదలయ్యారు. వారంలోనే మూడు చోరీలు చేశారు. ముంబైకి పారిపోతున్న సత్తిని సిటీ నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చే సి రూ.1.5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.