కారేపల్లి హైస్కూల్‌ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. హెడ్మాస్టర్ పై ఆగ్రహం

కారేపల్లి హైస్కూల్‌ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. హెడ్మాస్టర్ పై ఆగ్రహం

కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కారేపల్లి లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని తరగతి గదులను పాఠశాల పరిసరాలను ప్లేగ్రౌండ్ పరిశీలించారు. యూనిఫామ్స్ కొన్ని పంపిణీ చేయకుండా ఉంచడం, మిగిలిన పుస్తకాలను స్క్రాప్ వస్తువుల గదిలో పడేయడంతో  హెడ్మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు యూనిఫామ్  తప్పకుండా ధరించాలని సూచించారు. 

సొసైటీ గోదాం తనిఖీ 

అనంతరం కారేపల్లి సొసైటీ ఎరువుల గోదాంను తనిఖీ చేశారు. ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఏఓను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడారు. ప్రధాన రహదారిలో డ్రైనేజీల సమస్యపై సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.  వారంలోగా సమస్యకు పరిష్కారం చూపాలని ఎంపీడీవోను ఆదేశించారు.  

గేదెల సేకరణలో వేగం పెంచాలి

ఇందిరా మహిళా డెయిరీ లో భాగంగా నాణ్యమైన జాతి,  పాల దిగుబడి ఇచ్చే గేదెల సేకరణ జరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.  మొదటి విడతలో 250 గేదెల సేకరణ వెంటనే చేపట్టాలన్నారు. తుని, ఆలమూరు, తణుకు, ఉండి, కంకిపాడు లో గేదెల సేకరణకుగాను బృందాలను పంపాలన్నారు. ఒక్కో బృందంలో 25 మంది లబ్ధిదారులు, నలుగురు అధికారులు ఉన్నట్లు ఆయన అన్నారు