
- రూ.1.49 లక్షల విలువైన నగదు, ఆభరణాలు చోరీ
- భద్రాద్రి జిల్లా లోతువాగు ప్రాంతంలో ఘటన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ‘అర్ధరాత్రి వేళ సార్ లిఫ్ట్ ఇవ్వండంటూ దండం పెట్టి అడిగిన ఓ వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకోగా అతడు మొత్తం దోచుకుపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు ప్రాంతంలోని కొత్తగూడెం–టేకులపల్లి మెయిన్రోడ్పై చోటుచేసుకుంది. టేకులపల్లి మండలానికి చెందిన వాసాల తిరుపతి తన కారులో సోమవారం రాత్రి కొత్తగూడెం వస్తున్నాడు.
లోతువాగు ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అంటూ దీనంగా దండం పెట్టి అడిగాడు. దీంతో పాపం అనుకున్న తిరుపతి రాత్రి టైంలో బస్సులు, ఆటోలు ఉండవు. ఎలా పోతాడో ఏమో అనుకుని కారు ఆపాడు. కారు ఆగిన మరుక్షణం రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోంచి ముఖానికి కర్చీఫ్లు కట్టుకొని వచ్చిన ముగ్గురు వ్యక్తులు తిరుపతి కళ్లల్లో కారం కొట్టారు.
కారు తాళాలతో పాటు తిరుపతి దగ్గరున్న సెల్ఫోన్, బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొంతసేపటికి తేరుకున్న తిరుపతి అటుగా వస్తున్న ఆటో ఎక్కి లక్ష్మీదేవిపల్లి పీఎస్కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చాడు. దోచుకెళ్లిన సొత్తు విలువ రూ.1.49 లక్షలు ఉంటుందని తెలిపాడు. దారి దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ఎస్సై రమణారెడ్డి తెలిపారు.