కోల్​బెల్ట్​ ఏరియాలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు

కోల్​బెల్ట్​ ఏరియాలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు
  • ఇంటి వెనుకవైపు నుంచి దొంగతనాలు
  • భారీగా బంగారు ఆభరణాల చోరీ

సింగరేణి కార్మికుడు రాజ్​కుమార్ - సుజాత దంపతులు మధ్యాహ్నం సమీపంలోని స్కూల్​లో చదువుకుంటున్న పిల్లలకు టిఫిక్ బాక్స్ ఇచ్చేందుకు వెళ్లి అరగంటలో తిరిగి వచ్చేలోపు దొంగలు ఇంటి వెనుకవైపు తలుపులు తీసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల క్యాష్​ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన స్థానిక పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో జరిగింది. 

రామకృష్ణాపూర్​ భగత్​సింగ్ నగర్  సింగరేణి క్వార్టర్​లో నివాసముండే ట్రాఫిక్​ హెడ్​ కానిస్టేబుల్​ తిరుమలాచారి కుటుంబ సభ్యులతో కలిసి గత నెల30న మధ్యాహ్నం షాపింగ్ కోసం మంచిర్యాలకు వెళ్లాడు.  సాయంత్రం వచ్చి చూసేసరికి దొంగలు ఇంటి వెనుకవైపు తలుపులు పగులగొట్టి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇదే ఇంటి ఎదుట ఉండే ప్రైవేటు ఉద్యోగి అక్కల రమేశ్ ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు దోచుకెళ్లారు.

రామకృష్ణాపూర్​,వెలుగు: కోల్​బెల్ట్​ ఏరియాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో జనం భయాందోళనకు గురవుతున్నారు. పట్టపగలే తాళంవేసి బయటికి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే దొంగలు కన్నాలు వేస్తున్నారు. పోలీసులూ దొంగలబారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. వరుస చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు ఖాకీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన రావడంలేదు. దీంతో దొంగలను పట్టుకోవడం సవాల్​గా మారింది. తాజాగా మంగళవారం రామకృష్ణాపూర్​లోని​ విద్యానగర్​లో రిటైర్డు సింగరేణి ఎంప్లాయి  ఇంట్లో దొంగలు రూ.1.30 లక్షల నగదరు, 30 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు.

తాళం వేసిన ఇండ్ల వెనుక వైపు నుంచి...

ఆరు నెలలుగా మందమర్రి, రామకృష్ణాపూర్​ పట్టణాల్లో జరిగిన దొంగతనాల్లో ఎక్కువ పట్టపగలే జరిగాయి.  ఇళ్ల యజమానులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చేంతలోపు దొంగలు ఇంటి వెనుక వైపు నుంచి చొరబడుతున్నారు. 

అంతర్​ రాష్ట్ర ముఠా పనా?

మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాలలో వరుస చోరీలతో పోలీసులకు కునుకులేకుండా పోయింది. రాత్రిపూట కాకుండా పట్టపగలే చోరీలు జరగడం, దొంగలు ఇంటి వెనుకవైపు నుంచి ప్రవేశించడం, పలుచోట్ల ఇంటి కుటుంబసభ్యులు బయటకు వెళ్లిన గంటల వ్యవధిలోనే చోరీలు జరగడం కలకలం సృష్టిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు కాలనీల్లో తిరుగుతూ అదును చూసి  చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సంఘటన స్థలంలో సేకరించిన  ఫ్రింగర్​ ప్రింట్స్​ పోలీసుల వద్ద ఉన్న పాత నేరస్థులకు మ్యాచ్ కాకపోవడంతో కొత్త టీంల పనా? అంతర్ ​రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయోమోనని ఆరా తీస్తున్నారు.  పాత నేరస్థుల కదలికలపై  నిఘా పెంచారు. ఇటీవల కాలంలో భారీగా నిర్మాణ పనులు జరుగుతుండటంతో కోల్ ​బెల్ట్​ ప్రాంతాల్లో  కొత్త వ్యక్తుల సంచారం పెరిగింది. రామకృష్ణాపూర్​, మందమర్రి పోలీస్​ స్టేషన్ల పరిధిలో సుమారు 150పైగా సీసీ కెమెరాలుండగా అందులో చాలా పనిచేయడంలేదు. 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

రామకృష్ణాపూర్ మున్సిపల్ వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు మున్సిపల్  ఫండ్​ఉపయోగించాలి. కెమెరాల కోసం ప్రజల నుంచి డబ్బులు సేకరించడం కష్టంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ముందుకు రావడంలేదు. ఇందుకోసం కౌన్సిలర్లు చొరవచూపాలి. డీఎంఎఫ్​టీ ఫండ్స్​తో సింగరేణేతర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు సహకరిస్తూ  ఇక్కడి ప్రాంతాలను విస్మరిస్తున్నారు.

- మహంకాళి శ్రీనివాస్, బీజేపీ టౌన్  ప్రెసిడెంట్