హైదరాబాద్, వెలుగు: వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించిన తీన్మార్ మల్లన్న గురువారం శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మల్లన్న అభిమానులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జీవితంలో మరిచిపోలేని రోజని, ఇదే నాకు మొదటి అవకాశమని అన్నారు. ఇప్పటివరకు వార్డు మెంబర్గా కూడా పనిచేయని తాను, ఏకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం బాధ్యతను పెంచిందన్నారు. మండలిలో గ్రాడ్యుయేట్ల సమస్యలపై గళం విప్పుతానన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.