అయ్యో పాపం...! డెంగ్యూతో మూడో తరగతి విద్యార్థి మృతి

అయ్యో పాపం...! డెంగ్యూతో మూడో తరగతి విద్యార్థి మృతి
  • సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌‌ మండలం అనంతసాగర్‌‌లో విషాదం 

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు : డెంగీ జ్వరంతో మూడో తరగతి స్టూడెంట్‌‌ చనిపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌‌ మండలంలోని అనంతసాగర్‌‌ గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బోనగిరి కిష్టయ్య, రూప దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన యశ్వంత్ (10) కుకునూరుపల్లిలోని ఓ ప్రైవేట్‌‌ స్కూల్‌‌లో మూడో తరగతి చదువుతున్నాడు. 

యశ్వంత్‌‌కు మూడు రోజుల కింద జ్వరం రావడంతో గురువారం గజ్వేల్‌‌లోని ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. బ్లడ్‌‌ టెస్ట్‌‌ చేసిన డాక్టర్లు డెంగ్యూగా నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో యశ్వంత్‌‌ చనిపోయాడు. మండలంలో 10 రోజుల్లోనే డెంగీతో ముగ్గురు చనిపోయారు.