- దూసుకొచ్చిన మరిన్ని కోతులు..వాటికీ నీళ్లు ఇచ్చిన ప్రయాణికులు
- మహారాష్ట్రలోని విదర్భలో ఘటన
ముంబై: ఎండలు మండిపోతుండటంతో వన్యప్రాణులు కూడా అల్లాడిపోతున్నాయి. మూగజీవాలు గుక్కెడు నీటి కోసం అడవులను దాటి రోడ్లపైకి, జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాగే ఓ కోతి గుక్కెడు నీటి కోసం ప్రాణాలకు తెగించి.. కదులుతున్న బస్సును అడ్డుకున్నది. తీవ్ర దాహం, అలసటతో ఉన్న కోతికి ప్రయాణికులు వాటర్ తాగించారు. అది చూసి అడవిలోని మరిన్ని కోతులు దాహం తీర్చుకోవడానికి బస్సు దగ్గరకు చేరుకున్నాయి. మూగజీవాలు నీటి కోసం పడుతున్న ఇబ్బందిని చూసి ప్రయాణికులు చలించిపోయారు. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..
యావత్మాల్ జిల్లా పూసద్ ఏరియాలో ఓ బస్సు బుధవారం ప్యాసింజర్లతో పూసద్ వైపు వెళ్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు అటవీ ప్రాంతంలోకి రాగానే.. ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చి బస్సుకు అడ్డంగా నిలబడింది. డ్రైవర్ ఎంత హారన్ కొట్టినా, ప్రయాణికులు గట్టిగా కేకలు వేస్తూ బెదిరించినా కదల్లేదు. అది డీహైడ్రేషన్‌తో అల్లాడిపోతూ దాహం తీర్చుకునేందుకు నీటి కోసమే ప్రాణాలకు తెగించి బస్సును ఆపిందని గ్రహించారు. దీంతో కొందరు ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి దానికి నీటిని తాగించారు. ఆ కోతి ఏమాత్రం భయం లేకుండా, వేగంగా నీటిని తాగడం చూసి బస్సులోని వారంతా చలించిపోయారు.
గుంపులుగా రోడ్డుపైకి కోతులు
బస్సును ఆపిన కోతి నీళ్లు తాగుతుండటం చూసి.. అడవిలోని మరికొన్ని కోతులు గుంపులుగా రోడ్డుపైకి దూసుకువచ్చాయి. ప్రయాణికులు చలించిపోయారు. తమ వాటర్ బాటిళ్లను ఒక్కొక్కటి తీసి కోతులకు అందించారు. ఒక్క చుక్క నీటి కోసం కోతులు పడిన ఆరాటం.. పెనుగులాట చూసి కొందరి ప్రయాణికుల కళ్లు చెమర్చాయి.
లతా శ్రీవాస్ అనే మహిళ ఈ హృదయవిదారక దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రభుత్వం, అటవీ శాఖ తక్షణమే అటవీ ప్రాంతాల్లో నీటి కుంటలు, ట్యాంకులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
