15 ఏళ్ల అమ్మాయికి 10 రోజుల్లో పెళ్లి.. ఏం జరిగిందంటే..?

15 ఏళ్ల అమ్మాయికి 10 రోజుల్లో పెళ్లి.. ఏం జరిగిందంటే..?

చూసిరావడాలు.. పెళ్లిచూపులు అయిపోయాయి

పిల్ల, పిల్లగాడు మాట్లాడుకున్నారు

ఓకే అనుకున్నారు

మాట ముచ్చట అయిపోయింది

కట్నకానుకలు మాట్లాడుకున్నారు

పూలు పండ్లు జరిపారు

పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు

పదిరోజుల్లోనే పెళ్లి

అప్పుడేం జరిగిందో తెలియాలంటే ఈ మినీ స్టోరీ చదవాల్సిందే.

కరీంనగర్ జిల్లా… జమ్మికుంట పట్టణం హనుమాన్ పల్లివాడలో ఈ నెలాఖరున జరగాల్సిన ఓ పెళ్లి క్యాన్సిలైంది. అమ్మాయికి పెళ్లి వయసు ఇంకా రాలేదు. ఆమెకు వయసు 15 ఏళ్లు. అబ్బాయి కుటుంబంతో మాట్లాడి ఈనెల 31న పెళ్లి తేదీని నిశ్చయించారు. ఐతే.. అమ్మాయి మైనర్ అన్న సంగతి పోలీసులు, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిసింది. వెంటనే అమ్మాయి వాళ్లింటికి పోలీసులతో వెళ్లారు అధికారులు.

వివరాలు ఆరా తీశారు. అమ్మాయిని 8వ తరగతి వరకే చదివించామని.. స్తోమత లేక రెండేళ్ల కిందట బడి మాన్పించామని ఆ తల్లిదండ్రులు చెప్పారు. సంబంధం చూసి పెళ్లి చేస్తున్నామని వివరించారు.

ఐతే.. చట్టరీత్యా ఇది చాలా తప్పని .. పెళ్లీడు రాని అమ్మాయికి పెళ్లి చేయొద్దని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. అమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివించే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని సూచించారు. అధికారులు చెప్పడంతో.. పెళ్లిని రద్దు చేసుకున్నారు తల్లిదండ్రులు.