ట్రస్ట్+ట్రూత్=లవ్ .. ప్రేమికుల కోసమే ఈ స్టోరీ

ట్రస్ట్+ట్రూత్=లవ్ .. ప్రేమికుల కోసమే ఈ స్టోరీ

స్కూల్​ ఏజ్​ నుంచి కాలేజీ ఏజ్​​లోకి అడుగుపెట్టగానే టీనేజ్​ పలకరిస్తుంది. ఈ వయసులో ఫ్యూచర్​, కెరీర్​, ఉద్యోగం, సంపాదన గురించి ఆలోచించేవారు  కొందరే. కానీ అందరూ ఆలోచించే సబ్జెక్ట్​ ఒకటుంది. అదే లవ్​. మీరు లవ్​ ట్రాక్​లో ఉన్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..

జీవితంలో ప్రతిఒక్కరూ ఎప్పుడో ఒక్కసారైనా లవ్​ను ఫీలవుతారు. ప్రేమించినవాళ్ల ఎదుట ఎక్స్​ప్రెస్​ చేశారా? ప్రేమపక్షుల్లా తిరిగారా? పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది పక్కనబెడితే.. అందరి విషయంలో ‘లవ్’​ మాత్రం కామన్​. అయితే లవ్​లో ఉన్నవాళ్లు.. ముఖ్యంగా అబ్బాయిలు ఏవేవో ఆలోచిస్తుంటారు. అవి కరెక్టో? కాదో? తెలిసే వయసు కాదు. దీంతో అవి బెడిసికొట్టి ఆ ప్రేమ పటాపంచలవుతుంది. కొన్నిసార్లు గొడవలకూ దారితీస్తుంది. మరికొన్నిసార్లు జీవితాలనే తారుమారు చేస్తుంది. అందుకే ప్రేమలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమను నిలబెట్టుకోవాలంటే ఎన్నోసార్లు వాళ్ళను వాళ్ళే నం కంట్రోల్​ చేసుకోవాల్సి వస్తుంది. వేసే ప్రతి అడుగు పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించి వేయాలి. అయితే ఈ విషయంలో సలహాలు ఇచ్చేవారు తక్కువ. ఇచ్చినా ఫ్రెండ్స్​ మాత్రమే ఇస్తుంటారు. వాళ్లూ టీనేజ్​లో ఉన్నవాళ్లే. అవి కూడా పూర్తిగా కరెక్ట్​ అని డిసైడ్​ చెయ్యలేం.

ఒక్కొక్కరి ప్రేమ ఒక్కోలా ఉంటుంది. ఒక సలహా ఇస్తే అది ఒకరి విషయంలో కరెక్ట్​ కావొచ్చు. మరొకరి విషయంలో తప్పు కావొచ్చు. లవర్​ను సంతోషపెట్టడానికి ట్రై చెయ్యమని చెప్పామనుకో… అతని ప్రవర్తనను ఆమె మరోలా అర్థం చేసుకోవచ్చు. దేన్నీ సీరియస్​గా తీసుకోడనే అభిప్రాయానికి రావొచ్చు. ఒకవేళ సీరియస్​గా ఉంటే.. సెన్సాఫ్​ హ్యూమర్​ లేదని అనుకోవచ్చు. అయితే ఏం చేయాలి? ఇదిగో.. ప్రేమపక్షులందరి కోసం నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు..

డబ్బా కొట్టుకోవద్దు..

ప్రేమలో ప్రతిఒక్కరూ ఎదుర్కొనే మొదటి సమస్య.. తన ప్రేమను ఎక్స్​ప్రెస్​ చేయడమే. ఇష్టపడినవారికి ‘నువ్వంటే ఇష్టం’ అని చెప్పలేక ఎన్నో అవస్తలు పడతారు. అందుకే ఎదుటివారే ఇష్టపడేలా చేసుకోవడం కోసం ఎన్నో ఫీట్లు చేస్తుంటారు. అలాంటివాటిలో గొప్పలు చెప్పుకోవడం ఒకటి. నిజానికి అమ్మాయిల దగ్గర డబ్బా కొట్టుకుంటే.. వాళ్లు తప్పుగా అనుకుంటారని చెబుతున్నారు నిపుణులు. డౌన్​ టు ఎర్త్​ ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. అలాంటివాళ్లతోనే ఎక్కువగా గడిపేందుకు ఇంట్రెస్ట్​ చూపిస్తారట. సో.. అబ్బాయిలు ‘డోంట్​ డబ్బా’!!

జెన్యూన్​గా ఉండాలి. కానీ

తాను ప్రేమించబోయే అమ్మాయి దగ్గర ఏదీ దాచొద్దనుకుంటారు అబ్బాయిలు. జెన్యూన్​గా ఉండాలనుకుంటారు. కొన్నిసార్లు తమ పాత ప్రేమ కథల గురించి కూడా చెప్పేస్తారు. అయితే అందరి విషయంలో ఇలా ఉండడం కరెక్ట్​ కాదు. జెన్యూన్​గా ఉండేవాళ్లను అమ్మాయిలు ఇష్టపడినా.. రిలేషన్స్​ విషయానికి వచ్చేసరికి వాళ్ల ఆలోచనలు మారిపోతాయి. ఎలా రియాక్ట్​ అవుతారో చెప్పలేం.
ఒకవేళ తనను కూడా   అలాగే వదిలేస్తాడేమో! అనుకునే ప్రమాదం కూడా ఉంది. అయినా ముగిసిపోయిన బంధాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఫ్లాష్​బ్యాక్​ను పాతిపెట్టి ఉంచడమే కరెక్ట్​.

దిక్కులు చూడొద్దు..

ఎదురుగా అమ్మాయి ఉన్నప్పుడు ఆమెతో ఏదైనా మాట్లాడితే తన కళ్లల్లోకి చూస్తూ మాట్లాడాలని చెబుతున్నారు నిపుణులు. దిక్కులు చూస్తూ మాట్లాడడం వల్ల మనం నిజాయతీగా ఉండడం లేదనే ఫీలింగ్ కలుగుతుందట. కళ్లల్లోకి చూసి మాట్లాడడం వల్ల కెమిస్ట్రీ కుదిరి ప్రేమ రెట్టింపవుతుందంటున్నారు.

తొందర పడొద్దు..

టీనేజ్​లో ఉన్న అబ్బాయిలకు ప్రేమంటే ముద్దులు, కౌగిలింతలు మాత్రమే గుర్తుకొస్తాయి. అమ్మాయిలు వీటిని అంతగా ఇష్టపడరు. పైగా అలాంటి అబ్బాయిలను దూరం పెడతారట. అందుకే రొమాంటిక్​ మాటలు, చేతల విషయంలో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టపడుతున్న అమ్మాయి ఎంతో దగ్గరైతే తప్ప.. అలాంటి ఆలోచన చేయకూడదు.

తెలుసుకొని మాట్లాడాలి..

అమ్మాయిలతో మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నామో దానిపై కచ్చితంగా అవగాహన ఉండాలి. ఒకవేళ లేకపోతే దాని గురించి మాట్లాడొద్దు. అంతేకానీ.. తెలియని విషయంపై మాట్లాడి, అదే కరెక్ట్​ అని వాదించకూడదు. ఏం మాట్లాడాలనుకుంటున్నారో అంతవరకే మాట్లాడి ఊరుకోవడం మంచిది. అలా కాదని వాదిస్తే.. అది బంధాన్ని తెంపేదాకా వెళ్లొచ్చు.

అమ్మాయిలూ.. మీరు కూడా..

ఎదుటివాళ్ల ప్రేమను అంగీకరించే పరిస్థితిలో మీరు లేకపోతే ఆ విషయాన్ని వాళ్లతో క్లియర్​గా చెప్పాలి. అంతేకానీ వెంట తిప్పుకోవద్దు. ఫ్రెండ్స్​ అందరికీ బాయ్​ఫ్రెండ్​ ఉన్నారు కదా.. అని మీకూ ఓ బాయ్​ ఫ్రెండ్​  ఉండాలి అనుకొని ప్రేమించొద్దు. నిజంగా ప్రేమిస్తే… మీ తల్లిదండ్రులను ఒప్పించే ధైర్యం ఉంటేనే ప్రేమించాలి. గిఫ్ట్​ల కోసమో, అవసరాల కోసమో, డబ్బు కోసమో ప్రేమను వాడుకోవద్దు. మీ ప్రేమ.. మిమ్మల్ని ప్రేమించినవాళ్లను అమ్మానాన్నలకు దూరం చేయొద్దు. ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోతే జీవితం ముగిసిపోయిందన్న రీతిలో ఆలోచించడం తప్పు. ప్రేమ ఒక్కటే కాకుండా ఎంతో జీవితం మిగిలి ఉంది. దాని గురించి కూడా ఆలోచించాలి. మీ ప్రేమలో నిజాయతీ ఉంటే ఈ రోజుల్లో పెద్దలు కూడా పెద్దగా అడ్డుచెప్పడంలేదు. ఆ నిజాయతీని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి.

పేరెంట్స్ను మరిపించాలి

ప్రేమించే అమ్మాయి మన ప్రేమను అంగీకరించాలంటే ప్రతి అబ్బాయి పేరెంట్స్​ పాత్రను పోషించాలి. మనతో ఉంటే సెక్యూర్​గా ఫీలవ్వాలి. అంతేకాదు.. అమ్మాయి దగ్గర తక్కువగా మాట్లాడాలి. ఎక్కువగా వినాలి. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ల బాధను, నచ్చే విషయాలను మనతో చెప్పాలనుకుంటారు. వాటిని పట్టించుకోకుండా మనమే చెబుతూపోతే వాళ్లు మనకు దూరమయ్యే అవకాశముంది. ఇక అమ్మాయిలను ఆకట్టుకునేందుకు గిఫ్ట్​లు, చాక్లెట్లు కొనిస్తుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికమే. అవి కొనివ్వలేని రోజు వాళ్లమీద మనకున్న ప్రేమ తగ్గిందనే అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు.. కేవలం గిఫ్ట్​లను చూసి  ప్రేమించే అమ్మాయిలు ఈ రోజుల్లో లేరు. ఎందుకంటే వాళ్లు కూడా మన గురించి లోతుగా ఆలోచిస్తున్నారు. నిజాయతీగానే ఉంటున్నాడా? మాట నిలబెట్టుకుంటున్నాడా? లేక గొప్పలు చెబుతున్నాడా? అతని గోల్​ ఏంటి? దానిని సాధించడం కోసం ఎంత కష్టపడుతున్నాడు? అని ఆలోచిస్తున్నారు. అంతేకానీ.. సినిమాటిక్​గా, డ్రమాటిక్​గా, రొమాంటిక్​గా.. కట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు ఎక్కువగా ఫలించవు. అప్పటికి ప్రేమలో పడ్డా ఆ ప్రేమ దీర్ఘకాలం నిలవదు. ఇక ప్రేమ విషయంలో అబ్బాయికే కాదు అమ్మాయికి కూడా ప్రేమకు డెఫినిషన్ తెలియకపోవడమే ఈ రోజుల్లో ప్రధాన సమస్య. నిజానికి ఒక ప్రేమ మరో నలుగురి ప్రేమను నిలబెట్టాలి. అంటే.. అబ్బాయి పేరెంట్స్​, అమ్మాయి పేరేంట్స్​ ప్రేమను కూడా నిలబెట్టాలి. అంతేతప్ప ప్రేమను నిలబెట్టుకునేందుకు పేరెంట్స్​ ప్రేమకు ఆమెను దూరం చేయొద్దు.

ఇంకొంతమంది అబ్బాయిలుంటారు… ప్రేమించేదాకా వెంటబడతారు. నిజానికి వాళ్లంతా ఒక్క విషయం ఆలోచించాలి. ప్రేమించే హక్కు మనకు ఎంత ఉందో.. నిరాకరించే హక్కు కూడా అమ్మాయికి అంతే ఉంది. మొండిగా సాధించుకున్న ప్రేమ కలకాలం నిలబడదు. అంతేకాదు.. ‘ ప్రేమించేటప్పుడు శాడిజం పనికిరాదు. మనతోనే మాట్లాడాలి, మనకు నచ్చినవాళ్లతోనే మాట్లాడాలి, మనం ఫోన్​ చేసినప్పుడు  ఎంగేజ్​ రావొద్దు, చెప్పిన టైంకు ఫోన్​ చేయాలి..’ ఇటువంటి మనస్తత్వం ఉండొద్దు.  ఒక్కమాటలో చెప్పాలంటే మనల్ని ప్రేమించినందుకు బాధపడొద్దు. అటువంటి ప్రేమను పొందినప్పుడే అది కలకాలం నిలిచి ఉంటుంది.

‌‌‌‌– డాక్టర్​ కళ్యాణ్​చక్రవర్తి,
కన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్​, లుసిడ్​ డయాగ్నోస్టిక్స్​, బంజారాహిల్స్​, హైదరాబాద్.