నేపాల్ ప్రధాని రేసులో వందేండ్ల పెద్దాయన

నేపాల్ ప్రధాని రేసులో వందేండ్ల పెద్దాయన

ఈ నెల 20న పార్లమెంట్ ఎన్నికలు
కాట్మండు :
నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని ప్రచండతో పోరాడేందుకు స్వాతంత్ర్య సమర యోధుడు, వందేండ్ల వయసు దాటిన దత్తా పోఖరేల్ సిద్ధమయ్యారు. ఈ నెల 20న జరగనున్న నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు నియోజకవర్గాల నుంచి ఆయన నామినేషన్ వేసినట్లు నేపాలీ కాంగ్రెస్(బీపీ) చీఫ్​ సుశీల్ మాన్​సెర్చన్ తెలిపారు. ఏడుగురు పిల్లలున్న, గూర్ఖా జిల్లాకు చెందిన పోఖరేల్​కు సోమవారంతో 100 ఏండ్లు నిండాయని, నేపాలీ కాంగ్రెస్ తరఫున చెంబు గుర్తుతో పోటీ చేస్తున్నారని సెర్చన్ చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడుస్తారని, మాట్లాడుతారని, చురుగ్గా రాజకీయాల్లో ఉంటున్నారని అన్నారు. 

మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే.. 
దేశంలో నిజమైన నాయకుడు లేడని, ఇప్పటివరకున్న లీడర్లంతా డబ్బు సంపాదించేందుకే రాజకీయాల్లోకి వచ్చారని పోఖరేల్ అన్నారు. ప్రజల హక్కులు కాపాడేందుకు, నేపాల్​ను మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే తాను తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగానని చెప్పారు. తన ప్రత్యర్థి ప్రచండను ఎన్నికల్లో ఓడిస్తానని అన్నారు.