మేడారంలో ఈసారి ప్లాస్టిక్ ​‌ఫ్రీ జాతర

మేడారంలో ఈసారి ప్లాస్టిక్ ​‌ఫ్రీ జాతర
  •  పర్యావరణాన్ని కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ప్లాస్టిక్​తేవద్దు.. అమ్మొద్దు.. వాడొద్దు’ స్లోగన్​తో అవగాహన
  • విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆఫీసర్లు
  • ఇప్పటికే రెండు చెక్‌ పోస్టుల ఏర్పాటు

జయశంకర్‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారం మహా జాతరను ఈసారి ప్లాస్టిక్‌ ఫ్రీ గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్లకోసారి మహాజాతర అయిపోగానే మేడారం మొత్తం ప్లాస్టిక్​వ్యర్థాలతో నిండిపోతోంది. దీంతో పర్యావరణం దెబ్బతినడమేకాకుండా, వ్యర్థాలను తిని వందలాది పశువులు, అటవీ జంతువులు చనిపోతున్నాయి. ఈ క్రమంలో సమ్మక్క జాతరను పర్యావరణహితంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి ప్లాస్టిక్​ను పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు.

 మేడారంలో ప్లాస్టిక్​ వినియోగాన్ని నిషేధిస్తూ జిల్లా కలెక్టర్‌‌ఇలా త్రిపాఠి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. షాపుల్లో ప్లాస్టిక్‌‌ కవర్లు, బ్యాగులు వాడకూడదని, భక్తులు కూడా  ప్లాస్టిక్‌ ‌కవర్లు, బ్యాగులు తేవద్దని సూచిస్తున్నారు. ప్లాస్టిక్‌‌ కు బదులు జ్యూట్‌, కాటన్ బ్యాగులు వాడాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నారు. మేడారానికి వచ్చే వెహికల్స్‌ చెక్​ చేసి.. ప్లాస్టిక్‌ ‌కవర్లుంటే స్వాధీనం చేసుకుని జ్యూట్‌‌బ్యాగులు అందజేస్తున్నారు.  

శబరిమల విధానంపై స్టడీ

మేడారం మహాజాతరకు ప్రపంచం నలుమూలల నుంచి కోటిన్నర మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జాతరలో ప్లాస్టిక్‌‌ కవర్లు, గ్లాసుల వాడకంతో పర్యావరణం దెబ్బతింటోంది. శబరిమలలో ప్లాస్టిక్​ వినియోగాన్ని కేరళ ప్రభుత్వం  పూర్తిగా ఆపేయగలిగింది. అక్కడ అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసేందుకు 2017లో అప్పుడు  ములుగు సబ్‌‌ కలెక్టర్‌ గా ఉన్న, ప్రస్తుత ఖమ్మం కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం శబరిమలను విజిట్ చేసింది. అక్కడికి  కోట్లాది మంది వస్తున్నా ఎక్కడా ప్లాస్టిక్​ వస్తువు అన్నదే కనిపించదు.

ఆర్టీసీ బస్సులు,  ప్రైవేట్‌‌ వెహికల్స్‌‌ తనిఖీ చేసి  ప్లాస్టిక్‌‌ వస్తువులుంటే స్వాధీనం చేసుకుంటారు. వాటికి బదులు పర్యావరణానికి చేటు చేయని వస్తువులను ఇస్తారు.  ఇందుకోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తారని.. మేడారంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని టీమ్​ సూచించింది. కమిటీ సిఫార్సుల మేరకు 2020 మహాజాతరలో ప్లాస్టిక్​ను నివారించేందుకు అప్పటి కలెక్టర్‌‌ నారాయణరెడ్డి ఏర్పాట్లు చేశారు. భక్తుల్లో అవగాహన కోసం గట్టమ్మ దేవాలయం వద్ద ప్లాస్టిక్‌‌ వస్తువులతో కాలకేయ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.    

రెండు చెక్‌ ‌పోస్టులు ఏర్పాటు

ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. అంతకన్నా  రెండు నెలల ముందు నుంచే భక్తులు  మేడారానికి తరలివస్తున్నారు. ప్లాస్టిక్‌ నిరోధానికి తాడ్వాయి, పస్రా రూట్‌‌లో రెండు చెక్‌‌ పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్‌‌ కవర్లు తీసుకుని  జ్యూట్‌‌బ్యాగులు అందిస్తున్నారు. జాతరకు ప్లాస్టిక్​తేవద్దంటూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టిక్​ ఫ్రీ జాతరకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గోడలపై పెయింటింగ్​ చేయించారు.

ఆర్టీసీ బస్సుల వెనుక, పట్టణాల్లో రద్దీగా ఉండే చోట్ల బ్యానర్లు కడుతున్నారు. ఒకవైపు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటున్నా మేడారంలో పూర్తిగా  ప్లాస్టిక్‌‌ నిషేధం అమలు కావడంలేదన్న వాదన వినిసిప్తోంది.  ఇప్పటికే  మేడారంలో వెలసిన షాపుల్లో బెల్లం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అమ్మవార్ల పూజ సామాగ్రి ప్లాస్టిక్‌‌ కవర్లలోనే అమ్ముతున్నారు.  వ్యాపారులు దొంగచాటుగా ప్లాస్టిక్​ కవర్లు తరలిస్తున్నారని తెలుస్తోంది.

మేడారం వెహికల్స్ కు పర్యావరణ పన్ను రద్దు

మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తుల వెహికల్స్ కు పర్యావరణ పన్ను(ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ నెల 2 నుంచి 29 వరకు పన్ను వసూలు నిలిపివేస్తున్నట్లు గురువారం స్పష్టం చేశారు. ఈ మేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, జాతరకు వచ్చేవారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని మంత్రి సురేఖ కోరారు.

ఏటూరునాగారం అభయారణ్యం పేరుతో మేడారం వచ్చే భక్తుల నుంచి అటవీశాఖ పన్ను వసూలు చేస్తోంది. పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం రూట్లలో ప్రయాణించే వెహికల్స్​ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కారు, ఆటోలకు రూ.50, ప్రైవేట్‌ బస్సులకు రూ.100 చొప్పున తీసుకుంటోంది. ఇలా వచ్చే పైసలను అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల రక్షణకు, ప్లాస్టిక్​ను తొలగించేందుకు అటవీ శాఖ వినియోగిస్తోంది. అయితే వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్జప్తుల మేరకు జాతర ముగిసే వరకు పర్యావరణ పన్నును నిలిపివేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో జాతరకు వచ్చే వెహికల్స్​ఈజీగా మూవ్​అయ్యే అవకాశం ఉంది.

జీపీ నుంచి నోటీసులిచ్చిన్రు

ప్లాస్టిక్‌‌ కవర్లు, గ్లాసులు అమ్మొద్దని గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు ఇచ్చిండ్రు. అయినా కొందరు అమ్ముతున్నరు. పూర్తిగా ప్లాస్టిక్‌‌ కవర్లు ఆపాలి. వాటికి బదులు జ్యూట్‌‌ బ్యాగులు ఇవ్వాలి. జాతర నాటికి అన్నీషాపులలో ప్లాస్టిక్‌‌ కవర్లు ఉండకుండా చూడాలి. 
- కె.విక్కీ, మేడారం షాపు ఓనర్‌‌

రేపు భారీ ర్యాలీ

మేడారంలో ప్లాస్టిక్‌‌ వస్తువులు, వ్యర్థాలు తిని పశువులు చనిపోతున్నాయి. భక్తులు మిగిలిన ఆహారాన్ని ప్లాస్టిక్‌‌ కవర్లలో చుట్టి బయట పడేస్తున్నారు. వాటిని తిన్న పశువులు ప్లాస్టిక్‌‌ అరగక ప్రాణాలు కోల్పోతున్నాయి. మేడారంలో ప్లాస్టిక్‌‌ ఫ్రీ జాతర కోసం శుక్రవారం భారీ ర్యాలీ చేస్తున్నాం. ఇందులో ప్రజాప్రతినిధులు,  ఆఫీసర్లు పాల్గొంటున్నారు.
 - సిద్దబోయిన రమేశ్‌‌, సమ్మక్క పూజారి, మేడారం