గిల్‌‌.. జిగేల్‌‌.. గుజరాత్‌‌కు వరుసగా నాలుగో విజయం

గిల్‌‌.. జిగేల్‌‌.. గుజరాత్‌‌కు వరుసగా  నాలుగో విజయం
  •  77 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌పై గెలుపు
  •     రాణించిన సుదర్శన్‌‌, సుందర్‌‌, రషీద్‌‌, హోల్డర్‌‌

 

జైపూర్‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న గుజరాత్‌‌ టైటాన్స్‌‌.. ఐపీఎల్‌‌–19లో వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (44 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 84), సాయి సుదర్శన్‌‌ (36 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 55) హాఫ్‌‌ సెంచరీలతో దుమ్మురేపగా, స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ (4/33) స్పిన్‌‌ మాయాజాలం చూపెట్టడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో గుజరాత్‌‌ 77 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై గెలిచింది. ఫలితంగా టాప్‌‌ ప్లేస్‌‌ను సొంతం చేసుకుంది. టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 229/4 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్‌‌ 16.3 ఓవర్లలో 152 రన్స్‌‌కే ఆలౌటైంది. జడేజా (36), వైభవ్‌‌ సూర్యవంశీ (36) మినహా మిగతా వారు నిరాశపర్చారు. రషీద్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

గిల్‌‌కు గాయమైనా..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన గుజరాత్‌‌కు ఓపెనర్లు గిల్‌‌, సుదర్శన్‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆర్చర్‌‌ వేసిన తొలి ఓవర్‌‌లోనే 18 రన్స్‌‌ దంచారు. తర్వాతి ఓవర్‌‌లో సుదర్శన్‌‌ 4, 4, 6తో బ్యాట్‌‌ ఝుళిపిస్తే.. 4వ ఓవర్‌‌లో 4, 6, 4తో 15 రన్స్‌‌ వచ్చాయి. ఐదో ఓవర్‌‌లో 4, 6, 4 కొట్టిన గిల్‌‌ ఆరో ఓవర్‌‌లోనూ రెండు ఫోర్లు రాబట్టాడు. ఫలితంగా జీటీ 87/0 స్కోరుతో పవర్‌‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత ఈ ఇద్దరి జోరు కాస్త తగ్గింది. 8వ ఓవర్‌‌లో గిల్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను జైస్వాల్‌‌ జారవిడిచి మూల్యం చెల్లించుకున్నాడు. 9వ ఓవర్‌‌లో గిల్‌‌ పాదానికి గాయం కాగా ఫిజియోతో చికిత్స తీసుకుని ఇన్నింగ్స్‌‌ కొనసాగించాడు. ఇదే ఓవర్‌‌లో సింగిల్‌‌తో సుదర్శన్‌‌ 30 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివరి నాలుగు ఓవర్లలో  27 రన్సే రావడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో గుజరాత్‌‌ 114/0 స్కోరుతో నిలిచింది. 11వ ఓవర్‌‌లో సింగిల్‌‌ తీసిన గిల్‌‌ 30  బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ అందుకున్నాడు. కానీ ఐదో బాల్‌‌కు సుదర్శన్‌‌ ఔట్‌‌ కావడంతో తొలి వికెట్‌‌కు 118 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన బట్లర్‌‌ (13) నిరాశపర్చినా.. గిల్‌‌ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 14వ ఓవర్‌‌లో బట్లర్‌‌ ఔట్‌‌తో సుందర్‌‌ (37 నాటౌట్‌‌) క్రీజులోకి వచ్చాడు. సింగిల్స్‌‌తో కుదురుకున్న సుందర్‌‌ తర్వాత ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన గిల్‌‌ జోరుకు 17వ ఓవర్‌‌లో బ్రిజేష్‌‌ శర్మ (2/47) అడ్డుకట్ట వేశాడు. ఇదే ఓవర్‌‌లో సుందర్‌‌ 4, 6 దంచితే హోల్డర్‌‌ (7) ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. కానీ 19వ ఓవర్‌‌లో బ్రిజేష్‌‌కే వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. చివర్లో రాహుల్‌‌ తెవాటియా (14 నాటౌట్‌‌), సుందర్‌‌ మూడు సిక్స్‌‌లతో 21 రన్స్‌‌ దంచడంతో జీటీ భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

రషీద్ తిప్పేశాడు. 

ఛేదనలో రాజస్తాన్‌‌ను జీటీ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆరంభంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన వైభవ్‌‌ సూర్యవంశీని మూడో ఓవర్‌‌లో పెవిలియన్‌‌కు పంపి సిరాజ్‌‌ (1/55) మొదలుపెట్టిన వికెట్ల పతనాన్ని మిగతా బౌలర్లు కూడా కొనసాగించారు. తర్వాత రబాడ (2/33) డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్‌‌ (3), హెట్‌‌మయర్‌‌ (6)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. దాంతో పవర్‌‌ప్లేలో రాజస్తాన్‌‌ 78/3తో కష్టాల్లో పడింది. అప్పటి వరకు ఓ ఎండ్‌‌లో పాతుకుపోయిన ధ్రువ్‌‌ జురెల్‌‌ (24) ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా రషీద్‌‌ స్పిన్‌‌ ముందు తేలిపోయాడు. 8వ ఓవర్‌‌లో మూడు బాల్స్‌‌ తేడాలో జురెల్‌‌తో పాటు డొనోవాన్‌‌ ఫెరీరా (4)ను ఔట్‌‌ చేసిన రషీద్‌‌.. 12వ ఓవర్‌‌లో శుభమ్‌‌ దూబే (15), 14వ ఓవర్‌‌లో జడేజా వికెట్లు తీశాడు. ఫలితంగా రాజస్తాన్‌‌ 136/7తో ఎదురీత మొదలుపెట్టింది. చివర్లో  హోల్డర్‌‌ (3/12) వరుస ఓవర్లలో ఆర్చర్‌‌ (5), డాసున్‌‌ షనక (16), తుషార్‌‌ దేశ్‌‌పాండే (1)ను ఔట్‌‌ చేసి జీటీకి భారీ విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌‌: 20 ఓవర్లలో 229/4 (గిల్‌‌ 84, సుదర్శన్‌‌ 55, బ్రిజేష్‌‌ 2/47).
 రాజస్తాన్‌‌: 16.3 ఓవర్లలో 152 ఆలౌట్‌‌ (జడేజా 38, వైభవ్‌‌ 36, రషీద్‌‌ 4/33).