ఓటేయనోళ్లపై ట్రోల్స్, కామెంట్స్.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్​

ఓటేయనోళ్లపై ట్రోల్స్, కామెంట్స్.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : సిటీ ఓటర్లు, ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఓటింగ్​కు దూరంగా ఉండడంతో సోషల్​ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్​శాతం తగ్గడం, పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతుండడం వంటి వాటిపై సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున మీమ్స్​ వైరల్​చేస్తున్నారు. వీటిని కొందరూ ట్రోలింగ్​చేస్తూ కామెంట్స్​పెడుతున్నారు. సిటీలో మాల్స్​ ఓపెన్​ రెండు, మూడు వారాల పాటు సిటీ జనాలపై కిటకిటలాడుతాయి.. కానీ ఎన్నికల రోజున ఓటు వేసేందుకు వెళ్లకపోతుండగా.. సెంటర్లు వెలవెలబోతున్నాయే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

వీటికి కొందరూ “షాపింగ్​పై ఉన్న శ్రద్ధ ఓటింగ్​పై లేదాయే ” అంటూ కామెంట్స్​ పెడుతున్నారు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చింది ఇంట్లో నిద్ర పోవడానికి కాదు పోయి ఓటు వేయండని, సినిమా రీ రిలీజ్​ ఉన్నప్పుడు, మాల్స్​లో షాపింగ్​ఆఫర్స్​ఉన్నప్పుడు క్యూలైన్​ కట్టి గంటల పాటు నిల్చొని ఉంటారు, కానీ పోలింగ్​ కేంద్రాల్లో ఒక గంట పాటు వేచి ఉండరని, ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్లరు కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తారు అని ట్రోలింగ్​ జోరుగా సాగుతోంది. 

తక్కువ పోలింగ్​ శాతం నమోదవడంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్​కు ముందే ఓటు హక్కుపై   పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖలు, ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలు, వాకథాన్​ల ద్వారా అవగాహన కల్పించింది.  అయినా ఐటీ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిసారి లాగే ఈసారి కూడా ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది ఓటింగ్​కు దూరంగా ఉన్నారు.