వారి సహకారంతోనే రైల్వేలైన్​కు ఆమోదం లభించింది

వారి సహకారంతోనే రైల్వేలైన్​కు ఆమోదం లభించింది

మెదక్​ టౌన్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడంతోనే అక్కన్నపేట–మెదక్ రైల్వేలైన్​ పనులు ఏండ్ల తరబడి ఆలస్యమయ్యాయని బీజేపీ మెదక్​ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంత్రులు హరీశ్ రావు, నిరంజన్​ రెడ్డి మెదక్ రైల్వే స్టేషన్​ లో రేక్​ పాయింట్​ను ప్రారంభించి వెళ్లిన తర్వాత బీజేపీ నాయకులతో ఆయన అక్కడికి వచ్చి పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర మాజీ సహాయ మంత్రి దత్తాత్రేయ, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, దివంగత ఆలె నరేంద్రల ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో  రైల్వే సాధన సమితి ఉద్యమంతో పాటు, మాజీ ఎంపీలు నరేంద్ర, విజయశాంతి కృషి, దత్తాత్రేయ సహకారంతోనే రైల్వేలైన్​కు ఆమోదం లభించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం ఉన్నప్పుడే రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు భరించేందుకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్​ఎస్​ ప్రజాతినిధులు మెదక్ కు రైల్వేలైన్​ తమ కృషి ఫలితమే అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే మెదక్​ నుంచి మిర్జాపల్లి, పటాన్​ చెరుకు లింక్​ లైన్​, మెదక్​ లో రైల్వే టెర్మినల్​ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రసాద్, జనార్దన్, శివ, రాజేందర్, అశ్విని, వీణ, రైల్వే సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.