రెండు డోసులు వేసుకున్నోళ్లకే హోటల్స్, బస్సులు, ఆఫీసుల్లోకి ఎంట్రీ

రెండు డోసులు వేసుకున్నోళ్లకే హోటల్స్, బస్సులు, ఆఫీసుల్లోకి ఎంట్రీ

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తూ.. మరో వైపు కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఆంక్షలు పెడుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా పరిస్థితులపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్ ఇవాళ (బుధవారం) ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇవాళ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైందని, కెనడా నుంచి ఫరీదాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంతో ఒమిక్రాన్‌ అని తేలిందని ఆయన చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిల్ తెలిపారు. డిసెంబర్ 19 వరకు రాష్ట్రంలో మూడు కోట్ల 11 లక్షల 86 వేల 292 డోసుల వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. అయితే రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకోని వాళ్లు జనవరి 1 నుంచి పబ్లిక్ ప్లేసుల్లోకి రావడానికి అనుమతించబోమని అనిల్ విజ్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్‌ రెండు డోసులు వేయించుకుంటేనే మాల్స్, మ్యారేజ్ హాల్స్, హోటల్స్, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, బస్సుల్లోకి రానిస్తామని వెల్లడించారు. ఒమిక్రాన్‌, కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తమ రాష్ట్రంలో కరోనా బారినపడిన మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం అందిస్తామని, బీపీఎల్ కుటుంబాలకు రూ.2 లక్షలు, కొవిడ్ వారియర్స్ కుటుంబాలకు రూ.20 లక్షలు, హెల్త్ వర్కర్స్‌కు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

గుంపులుగా సెలబ్రేషన్స్ చేసుకోవద్దని డీడీఎంఏ ఉత్తర్వులు

కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా