
- అలా మాట్లాడిన కేసీఆర్‌ను ఇంటికి పంపారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- కేంద్రంలో బీజేపీని 240 ఎంపీ సీట్లకే పరిమితం చేశారు
- స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా నేటికీ గ్రామాల్లో వివక్ష బాధాకరం
- విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయన్న మంత్రి
బషీర్‌బాగ్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే ప్రజాస్వామ్యవాదులే తగిన గుణపాఠం చెబుతారని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యానించిన కేసీఆర్‌ను ఇంటికి పంపారని, గత ఎన్నికల్లో బీజేపీని 240 ఎంపీ సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన గ్రామ గ్రామాన రాజ్యాంగం సన్నాహక సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. పే బ్యాక్ టూ సొసైటీకి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని సూచించారు.
కొంతమంది రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పైకి వచ్చాక, కింది వారికి సహాయం చేయడం మర్చిపోతున్నారని అన్నారు. అంబేద్కర్ తన సమాజాన్ని కాపాడుకోడానికి నిరంతరం కొట్లాడారని గుర్తుచేశారు. మహిళా సాధికారత, హక్కుల కోసం ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కీలకమైన ఆర్బీఐ స్థాపనలో అంబేద్కర్ పాత్ర ముఖ్యమైందన్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్టికల్3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. మన దేశానికి ఉన్న బలమైన రాజ్యాంగం ఏ దేశానికి లేదన్నారు.
పాఠశాల విద్యలో రాజ్యాంగంపై చాప్టర్..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో ఐక్యత వస్తే, దేశ భవిష్యత్తు వాళ్లదే అని మంత్రి వివేక్ తెలిపారు. పాఠశాల విద్యలో రాజ్యాంగంపై ఒక చాప్టర్ పెట్టాలని.. దీంతో విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగా హన, హక్కులు, బాధ్యతలు తెలుస్తాయని చెప్పారు. ఈ విషయంపై సీఎంతో మాట్లాడి, పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగాన్ని చేర్చే ప్రయత్నం చేస్తానన్నారు.
విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని, 75 ఏండ్ల క్రితం గ్రామాల్లో ఉన్న వివక్ష నేటికి ఉండడం బాధాకరమన్నారు. గ్రామ గ్రామానికి రాజ్యాంగం తీసుకెళ్లడం ద్వారా ప్రజలు జాగృతం అవుతారని, అందుకోసం కృషి చేస్తున్న మహేశ్వర్ రాజ్‌ను మంత్రి అభినందించారు. తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో సమాజానికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాన్ఫిడరేషన్ ప్రతినిధి, హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ, ప్రముఖ గాయకుడు మాస్టర్ జీ, యువ రచయిత భద్రం తదితరులు పాల్గొన్నారు.