సూర్యాపేట సైన్స్​ ఫెయిర్​లో ఆలోచింపజేసిన ఎగ్జిబిట్లు

సూర్యాపేట సైన్స్​ ఫెయిర్​లో ఆలోచింపజేసిన ఎగ్జిబిట్లు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా ఆనంద్​ విద్యామందిర్​ స్కూల్​లో సోమవారం నిర్వహించిన సైన్స్​ ఫెయిర్​లో  విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు ఆకట్టకున్నాయి. ఆయా ఎగ్జిబిట్ల గురించి, అందులోని సైంటిఫిక్​ విషయాల గురించి  విజిటర్స్​కు స్టూడెంట్లు చక్కగా వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి సైన్స్​ఫెయిర్​లో ఎగ్జిబిట్ల ప్రదర్శనకు 800 మంది స్టూడెంట్లు రిజిస్ట్రేషన్​చేసుకోగా, 517 మంది తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. దాదాపు 5 వేల మంది స్టూడెంట్లు సైన్స్​ఫెయిర్​చూసేందుకు వచ్చారు. రెండో రోజు దాదాపు20 వేల మంది స్టూడెంట్లు పాల్గొనే అవకాశముండడంతో ఆ దిశగా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

కోతుల బెడదకు మంకీ గన్ 

పెన్ పహాడ్  మండలం అనాజీపూర్​పీఎస్ఎంఎస్​ మోడల్​స్కూల్​కు చెందిన 9వ తరగతి స్టూడెంట్​విష్ణు ప్రియా ‘మంకీగన్’ తయారు చేసింది. రైతులు పొలాల్లో కోతుల బెడద  నుంచి తప్పించేందుకు ఈ గన్ తయారు చేసినట్లు వివరించారు. రూ.200 ఖర్చుతో  ప్లాస్టిక్ పైప్స్, కార్బెట్, స్టౌవ్ లైటర్ తో ఈ పరికరాన్ని తయారు చేయగా పైప్ లో కార్బెట్ వేసి నీళ్లు పోసి నిమిషం పాటు ఉంచి లైటర్ తో ప్రయోగిస్తే వచ్చే శబ్ధంతో కోతులు పారిపోతాయని విష్ణు ప్రియా వివరించింది.

ప్రమాదాల నివారణకు పాత్ ఫైండర్

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చివ్వెంల ఎం‌‌ఎస్‌‌ఆర్ స్కూల్ స్టూడెంట్​శ్రీధర్,  పాత్ ఫైండర్ డివైజ్ రూపొందించాడు. అల్ట్రా సోనిక్ సెన్సార్ ద్వారా వెహికల్​లో చిప్​ఏర్పాటు చేయడంతో రోడ్డుపై ప్రయాణించే టైంలో  వెహికల్​దగ్గరకు వెళ్లే టైంలో  సెన్సార్స్ పని చేసి వెహికల్​డైరెక్షన్​ఛేంజ్ చేసేలా డివైజ్ రూపొందించాడు. దీంతో ప్రమాదాన్ని నియంత్రించవచ్చని శ్రీధర్ వివరించాడు. డివైజ్ కోసం బ్యాటరీ లతో పాటు కోడింగ్ నేర్చుకుని అల్ట్రాసోనిక్ సెన్సార్స్ తయారు చేశానని చెప్పాడు.

వరిలో వాటర్ మేనేజ్ మెంట్ 

వ్యవసాయంలో రైతుకు శ్రమ, సమయం, నీళ్లను సేవ్ ​చేసేందుకు చివ్వెంల మండలం తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్​కు  చెందిన 8వ తరగతి స్టూడెంట్లు  నవదీప్, వంశీ ఇద్దరు కలిసి  ‘వాటర్ మేనేజ్ మెంట్ ఇన్ పాడి’ ని రూపొందించారు. పొలాల మధ్యలో సెన్సార్స్ ఏర్పాటు చేయడంతో పొలానికి ఎంత నీరు కావాలో తీసుకొని ఆటోమేటిక్ గా మోటార్ బంద్ అయ్యేలా దీని రూపొందించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇద్దరు స్టూడెంట్లు తమ తండ్రులు  రాత్రి వేళ పొలాల వద్ద పడుకుంటుండడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని తయారు చేసినట్లు చెప్పారు. 

పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ డిటెక్టర్

పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ నివారణ కోసం ‘ప్లాస్టిక్ డిటెక్టర్’ ను పెన్ పహాడ్ మోడల్ స్కూల్ టెన్త్​స్టూడెంట్​సాహెజ తయారు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో ఎంట్రెన్స్ వద్ద ప్లాస్టిక్ తో లోపలికి  వెళ్లే టైంలో ప్లాస్టిక్ ను గుర్తించి వెంటనే అలారం మోగుతుంది. ప్లాస్టిక్​ను టూరిజం ప్లేస్ లలో నివారిస్తే పర్యావరణం బాగుపడే అవకాశం ఉండడంతో దీన్ని రూపొందించినట్లు సాహెజ చెప్పారు.