
ఆస్ట్రేలియాలో రేసిజం మొదలైంది. అక్కడున్న స్థానికులు విపరీతమైన ద్వేషంతో ఊగిపోతున్నారు. ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ అంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు తమతో పాటు ఇరుగు పొరుగున నివసిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారు ఆస్ట్రేలియన్లు. ఒకే స్కూళ్లో చదివే స్టూడెంట్స్ పైన.. ఒకే ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగులపైనా.. ఒకే కంపెనీలో పనిచేసే కార్మికులపైనా.. ఇమ్మిగ్రెంట్స్ పేరున వివక్ష చూపిస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా వీధులన్నీ నియో-నాజీల ఆందోళనతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు దాడులు చేస్తారోనని బిక్కుబిక్కుంటూ గడుపుతున్నారు ఇండియన్స్ తో పాటు ఇతర దేశాల ప్రజలు.
ఆస్ట్రేలియాలో మాస్ ఇమ్మిగ్రేషన్ ఆపేయాలని స్థానికులు ఆందోళనలు చేపడుతున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా.. పేరుతో మొదలైన ర్యాలీలు కార్చిచ్చులా దేశమంతా అంటుకున్నాయి. ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ నినాదాలతో.. పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. ర్యాలీల సందర్భంగా విదేశీయులపై విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారు. ఆదివారం సిడ్నీ మారథాన్ లో 35 వేల మంది రన్నర్స్ పాల్గొని సిటీలోని ఒపెరా హౌస్ ను చుట్టుముట్టారు. మొదట ర్యాలీ కోసం 5 వేల నుంచి 8 వేల మంది గ్యాదర్ అయ్యి.. ఆ తర్వాత ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొని భయానక వాతావరణానికి దారితీశారు.
ఎందుకు ద్వేషం:
ఆగస్టు 31 (ఆదివారం) సిడ్నీలో మొదలైన ర్యాలీలు.. దేశవ్యాప్తంగా విస్తరించాయి. సిడ్నీతో పాటు ఇతర రాష్ట్రాల రాజధానులు, పట్టణాలు, గ్రామాలలో రేసిజం ర్యాలీలతో మార్గోగిపోతున్నాయి. మాస్ ఇమ్మిగ్రేషన్ మా కమ్యూనిటీస్ ను ఏకథాటిపైకి తీసుకొచ్చాయని నిరసనకారులు తమ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వం విదేశీయులను వెనక్కు పంపించేందుకు ధైర్యం చేయలేరని.. కానీ తాము చేస్తున్నామని ప్రకటించారు.
తమ సంస్కృతి, సంప్రదాయాలు, విద్య, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు.. మొదలైన అన్నింటినీ కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియాలో ప్రతీ ఇద్దరిలో ఒక విదేశీయులు ఉన్నారని.. ముఖ్యంగా ఇండియన్స్ తమ ఉపాధిపై దెబ్బకొడుతున్నారని ఆరోపిస్తూ నియో-నాజీలు సోషల్ మీడియాలో హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు.
ఇండియన్సే టార్గెట్:
నియో నాజీల ఆధ్వర్యంలో జరుగుతున్న విద్వేష పూరిత ర్యాలీల్లో.. స్థానికుల టార్గెట్ ఎక్కువగా ఇండియన్స్ పైనే ఉండటం ఆదోళన కలిగించే అంశం. ఆస్ట్రేలియాకు వందేళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే ఐదేళ్లలో ఎక్కువ మంది భారతీయులు వచ్చారని ఆరోపిస్తున్నారు. ఈ వలసలు తమ దేశంలోని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013 నుంచి 2023 వరకు 8 లక్షల 45 వేల మంది ఇండియన్స్ వలస వచ్చారని వెబ్ సైట్స్, పాంప్లెట్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. తమ స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్యమం తప్పదని అంటున్నారు.
ఆగస్టు 20వ తేదీ రాత్రీ కమ్యూనిటీ లీడర్లు ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి హేట్ స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. అదే రాత్రి ఇద్దరు ఇండియన్ మహిళలపై ట్రైన్ లో దాడి జరిగినట్లు అమర్ సింగ్ అనే ఇండియన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సిడ్నీలో అప్పటికీ ఇతర దేశాల స్టూడెంట్స్ పై దాడులు మొదలయ్యాయని తెలిపాడు.
మెల్ బోర్న్ ర్యాలీలో కూడా ఒక విదేశీ మహిళపై దాడులకు దిగినట్లు సింగ్ చెప్పాడు. ద్వేషాన్ని వెబ్ సైట్లలో స్ప్రెడ్ చేస్తున్నందుకు నియో-నాజీ గ్రూప్ NSN (National Socialist Network) నాయకుడు థామస్ సెవెల్ పై కేసులు నమోదు చేశారు స్థానిక పోలీసులు. సామరస్యాన్ని దెబ్బతీసి.. ద్వేషం వ్యాప్తి చేసి.. దాడులకు పురికొల్పేలా పోస్టులు చేసినందుకు అరెస్టు చేశారు.
ఖండించిన ప్రభుత్వం:
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ద్వేష పూరిత దాడులను ప్రభుత్వం ఖండించింది. జాత్యహంకార తీవ్రవాదానికి దేశంలో స్థానం లేదని పేర్కొంది. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేరున జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు ప్రభత్వం ప్రకటించింది. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని.. అలాంటి దాడులను, ద్వేషభావనను సహించేది లేదని లేబర్ గవర్నమెంట్ సీనియర్ మినిస్టర్ అయిన ముర్రే వాట్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాను నిలబెట్టాం.. మా పైనే ద్వేషమా: ఇండియన్స్
ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించుకునే హక్కు వారికి ఉంది.. కానీ.. ఆ ర్యాలీలన్నీ నియో-నాజీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని.. హేట్ స్ప్రెడ్ చేయడమే వారి ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్. ఆస్ట్రేలియా కోసం ఎంతో చేశాం. ఆస్ట్రేలియా అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. ఆస్ట్రేలియా దినోత్సవం చేసుకుంటాం.. విద్య, వైద్యం, సైన్స్, టెక్నాలజీ.. ఇలా అన్ని రంగాల్లో ఆస్ట్రేలియాను ప్రపంచ మేటిగా నిలబెట్టేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నాం.. కానీ ద్వేషంతో తమపై దాడులకు దిగటం దారుణమని అమర్ సింగ్ పేర్కొన్నారు.