కలవరపెడుతున్నకౌ ఫాక్స్..రాష్ట్రంలో వేలాది పాడిపశువులకు వ్యాధి

కలవరపెడుతున్నకౌ ఫాక్స్..రాష్ట్రంలో వేలాది పాడిపశువులకు వ్యాధి

వనపర్తి, వెలుగురాష్ట్రవ్యాప్తంగా పాడిపశువులకు కౌ ​ఫాక్స్​ సోకుతోంది.  లంపి చర్మ వ్యాధిగా చెప్పే ఈ రోగం జిల్లాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. మొదట్లో రాయలసీమలో కనిపించింది. అక్కడి నుంచి మన రాష్ట్రంలో అతిపెద్ద పెబ్బేరు పశువుల సంత నుంచి వివిధ జిల్లాలకు వ్యాపించింది. వనపర్తి జిల్లాలోనే 3 వేలకు పైగా పశువులు ఈ వ్యాధి బారినపడగా, గడిచిన నెల వ్యవధిలో 120 చనిపోయాయి. ఈ రోగానికి మందు లేదనీ, ముందు జాగ్రత్తగా గోట్​ఫాక్స్​ వాక్సిన్​ ఇస్తే పశువులను కాపాడుకోవచ్చని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.

ఏమిటీ వ్యాధి..

ఆవులు, ఎడ్లు, బర్లకు సోకుతున్న కౌఫాక్స్​ ఒక అంటువ్యాధి. లోకల్​గా లంపి చర్మవ్యాధి అంటారు. ఇది సోకిన పశువులకు ముందుగా జ్వరం, నొప్పులతో పాటు చర్మంపై బుడిపెలు వస్తాయి. మెడవాపు, గంగడోలు వాపు కనిపిస్తాయి. చర్మం కింద ఏర్పడిన బుడిపెలు క్రమంగా పుండ్లుగా మారి మరణిస్తాయి. పెద్దవాటికంటే లేగ దూడల్లో డెత్​రేట్​ ఎక్కువగా ఉంటోంది. వ్యాధి సోకిన పశువును కుట్టిన ఈగలు, దోమలు ఇతర పశువును కుట్టినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందుతోంది. వ్యాధిసోకిన పశువు లాలాజలంతో కలుషితమైన మేత, నీరు ద్వారా కూడా ఈ వ్యాధి మిగతా పశువులకు  సోకుతుంది.

ఎలా వచ్చిందంటే..

ఈ వ్యాధి  మొదట ఒడిశాలో కనిపించింది. ఆ తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్ మీదుగా ఏపీలోని  శ్రీకాకుళం జిల్లాకు చేరింది.  అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు, అటు నుంచి తెలంగాణకు వ్యాపించిందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధిని అరికట్టేమందు లేదని,  ముందు జాగ్రత్తగా పశువులకు టీకాలు ఇస్తున్నామని  అంటున్నారు. ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులు ఈ వ్యాధిని తట్టుకోవడం లేదు.  ఇవి మరణించడం వల్ల ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం జరుగుతోంది. పాడి ఉత్పత్తులపైనా ప్రభావం పడుతోంది. దీంతో పశుసంవర్థక ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు. రైతులకు ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

ఇలా చేయాలి

కౌ ఫాక్స్​ లక్షణాలు కనిపించిన వెంటనే ఆ పశువులను మంద నుంచి వేరుచేసి, వెంటనే  వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలి. -యాంటీ బయాటిక్‌‌ మందులతో పాటు జ్వరం, నొప్పుల నివారణకు సూదులు వేయించాలి. ప్రాథమికంగా గోట్​ఫాక్స్​వ్యాక్సిన్​ వేస్తే కొంత మేలు జరుగుతుంది. పశువులపై కీటకాలు, పురుగులు, దోమలు వాలకుండా వేపాకుతో తరుచూ పొగ వేయాలి.  వీలైతే దోమతెరలు వాడాలి.

డాక్టర్లు పట్టించుకుంటలేరు

మా ఊర్లో పశువులన్నింటికీ కౌఫాక్స్​వచ్చింది.  లక్షలు పెట్టి కొన్న ఎడ్లు, ఆవులు చచ్చిపోతుంటే డాక్టర్లు ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఫోన్​ చేస్తే ఇప్పుడొస్తం.. అప్పుడొస్తం అంటున్నరు తప్ప రావట్లేదు. ప్రైవేట్​ డాక్టర్ల వద్దకు పోతే వేలకు వేలు గుంజుతన్రు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ఈ వ్యాధి నుంచి మా పశువులను కాపాడాలి.

– నాగన్న, రైతు, బుసిరెడ్డిపల్లి, పాన్ గల్ మండలం, వనపర్తి జిల్లా

జాగ్రత్తలు తీసుకోవాలి

పాలమూరు లాంటి జిల్లాలో పశువులకు ఇలాంటి వ్యాధి రావడం ఇదే మొదటిసారి. ఈ రోగానికి ఎలాంటి మందు లేదు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు చెబుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోట్​ఫాక్స్​ టీకాలు ఇస్తున్నాం. ఈ టీకాల ద్వారా  పశువుల పరిస్థితి కొంత మెరుగుపడుతోంది.

‑ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పశువైద్య, సంవర్థకశాఖ అధికారి, వనపర్తి

గ్రామ పెద్దలముందే తమ్ముడిపై గొడ్డలితో దాడి