మేడారంలో భక్తుల సందడి

మేడారంలో భక్తుల సందడి

తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క –సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్​గఢ్, మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించారు. సంతానం కోసం జంపన్న వాగు ఒడ్డు మీద ఉన్న నాగులమ్మ, జంపన్న, గద్దెల వద్ద ముడుపులు కట్టారు.

 ఒడ్డు మీదనే ఉన్న  కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గద్దెల వద్దకు చేరుకుని ఎత్తు  బెల్లం( బంగారం)  పసుపు కుంకుమ, చీర సారే, గాజులు, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, సమర్పించి దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న మేకలు,కోళ్లను బలిచ్చారు. మేడారం చుట్టూ పక్కల ఉన్న జంపన్న వాగు,  చిలకలగుట్ట, శివరాంసాగర్, వనంరోడ్డు  వనంలోకి వెళ్లి చెట్ల కింద వంటావార్పు చేసుకుని ముందుగా దేవతలకు నైవేద్యం పెట్టి పిల్లాపాపలతో చుట్టాల బంధువులతో విందు భోజనాలు చేశారు. 

మేడారంలో సండే రోజు సందడిగా మారింది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో తాగునీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వనదేవతల ముందస్తు మొక్కుల కోసం ఒక్కరోజే 5 వేల మందికి పైగా భక్తులు మేడారం తరలివచ్చినట్లు ఎండోమెంట్ ఈవో వీరస్వామి తెలిపారు.