చిన్న జాబ్ ​మేళాకు క్యూ కట్టిన వేలాది నిరుద్యోగులు

చిన్న జాబ్ ​మేళాకు క్యూ కట్టిన వేలాది నిరుద్యోగులు
  • కరీంనగర్​లో మేళాకు క్యూ కట్టిన ఐదున్నర వేల మంది
  • పెద్ద చదువులు చదివీ చిన్న ఉద్యోగాలకు అప్లికేషన్లు
  • ఉద్యోగాల్లేక ఏండ్ల కొద్దీ ఖాళీగా ఉంటున్నామని ఆవేదన
  • సర్కారు నోటిఫికేషన్లు ఇయ్యక పోవడంపై ఆగ్రహం
  • నిరుద్యోగ భృతి ఇస్తే కాస్త రిలీఫ్ గానైనా ఉంటుం దని వెల్లడి

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​లో శనివారం జరిగిన జాబ్​ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు క్యూ కట్టారు. పెద్ద చదువులు చదివి కూడా ఏండ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న చాలా మంది.. ఏదో ఒక జాబ్​ దొరక్కపోతుందా అన్న ఆశతో బారులు తీరారు. చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా రెజ్యుమెలు ఇచ్చి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆశించిన ఉద్యోగాల్లేకపోవడం, కొందరికే చాన్స్​ రావడంతో ఉసూరుమన్నారు. సర్కారు ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడ్డారు. ఇప్పటికైనా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తే కాస్త రిలీఫ్​గా ఉంటుందని కోరారు.

పెద్ద సంఖ్యలో వచ్చినా..

కరీంనగర్​లో శనివారం మెగా జాబ్​మేళా నిర్వహిస్తున్నట్టు కొద్దిరోజుల కింద ప్రకటించారు. 18 –35 ఏండ్ల వయసున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రచారం చేశారు. పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన జాబ్​ మేళాకు కరీంనగర్ తోపాటు సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులువచ్చారు. మేళాకు 53 కంపెనీలు వచ్చాయి. వీటికి 5,216 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. 1,135 మందికి ఉద్యోగాలు వచ్చాయని నిర్వాహకులు చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్​ ఈ మేళాకు హాజరై ఆయా ప్రైవేటు కంపెనీలకు ఎంపికైన వారికి అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చారు. అయితే జెన్ ప్యాక్ట్, గామా, ఐకియా, టాటా స్ట్రైవ్ వంటి పెద్ద పెద్ద కంపెనీల పేర్లను మెగా జాబ్ మేళా బ్రోచర్ లో పెట్టారు. ఇది చూసి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు మేళాకు వచ్చారు. కానీ మేళాలో పెద్ద కంపెనీలు ఒక్కటీ లేకపోవడం, చిన్న చిన్న కంపెనీలే ఉండటంతో 5,216 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. ఇంకా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దేనికీ అప్లై చేసుకోకుండానే వెళ్లిపోయారు.

చదివిందొకటి.. ఉద్యోగమొకటి

డిగ్రీ కోర్సులతోపాటు బీటెక్, ఎంటెక్, పీజీలు, ఫార్మసీ కోర్సులు చేసిన చాలా మంది జాబ్​మేళాకు వచ్చారు. చదువులకు సంబంధం లేని చిన్న మార్కెటింగ్​ జాబ్​లకు అప్లై చేసుకున్నారు. ఉద్యోగాల్లేని పరిస్థితుల్లో ఏదో ఒక పని చేసుకోవడం బెటరన్న ఉద్దేశంతో అప్లికేషన్లు పెట్టుకున్నారు. బీటెక్ ఎలక్ట్రికల్ చదివినా టెలి కాలర్​ జాబ్​కు దరఖాస్తు చేసుకున్నవారొకరు.. లైఫ్ సైన్సెస్  పీజీ చేసి.. మార్కెటింగ్ ఉద్యోగానికి ఓకే చెప్పాల్సిన వచ్చినవారొకరు.. ఇలా ఎందరో కనిపించారు. ఉద్యోగాలు దొరక్కపోవడం, దొరికినా చదువుకు తగినవికాకపోవడమే దీనికి కారణమని చెప్తున్నారు.

12 వేలకు మించి ఇయ్యమంటున్నరు

నేను పీజీడీఎం పూర్తి చేసిన. మేనేజ్ మెంట్ సైడ్ పెద్ద కంపెనీలేమైనా వస్తయని, జాబ్​ దొరకుతదని అనుకున్న. కానీ చిన్న చిన్న కంపెనీలు వచ్చినయి. 10, 12 వేలు జీతమిస్తమన్నరు. ఆ జీతాలతో హైదరాబాద్ కు వచ్చి ఎట్ల పనిచేస్తం?

– మహేందర్, నగునూర్

ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లేకనే..

‘‘నాది బీఫార్మసీ అయిపోయింది. ఉద్యోగం కోసం చాలా ఏళ్లుగా ప్రిపేర్​ అవుతూనే ఉన్నం. ప్రభుత్వ నోటిఫికేషన్లు రావడం లేదు. తప్పనిస్థితిలో ఏదో ఒకటి చేయాలని జాబ్​ మేళాకు వచ్చినం. కానీ ఇక్కడ కూడా పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితే కనిపిస్తోంది.

– ముస్కు సౌమ్య , కరీంనగర్

నోటిఫికేషన్లు రాక.. ఏదో ఓ జాబ్​ కోసం

‘‘నేను బోటనీలో పీజీ పూర్తి చేసిన. పోటీ పరీక్షలు రాసి సర్కారు జాబ్ తెచ్చుకుందామంటె.. ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు మాత్రం వస్త లెవ్వు. అందుకే నా చదువుకు తగ్గ నౌకరీ కాకపోయినా.. ఏదో ఒకటి వస్తదనే ఆశతో జాబ్ మేళాకు వచ్చిన. ఇక్కడ కూడా సరైన కంపెనీలు లేవు. జాబ్​ వస్తదన్న నమ్మకం లేదు.’’

– పూజ, కరీంనగర్