
- సెకనుకు ఒక వెహికల్కు మించి టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ
యాదాద్రి వెలుగు: పండుగలతో యాదాద్రి జిల్లాలోని హైవే రోడ్లు బిజీ అయ్యాయి. క్షణం తీరిక లేకుండా వేలాది వెహికల్స్ రోడ్ల మీద ప్రయాణించాయి. జిల్లాలోని హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–వరంగల్ హైవేల మీదుగా ప్రతి సెకనుకు ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు వెళ్లాయి. రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు. ఈ రెండు పండుగలు ఒక్కరోజు తేడాతో వస్తాయి. తెలంగాణ ప్రజానీకం మొత్తం ఈ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వివిధ జిల్లాల నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వచ్చిన వలస జీవులు.. ఈ పండుగలకు సొంతూర్లకు వెళ్లడం పరిపాటి.
సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కోసం ప్రభుత్వం సెలవులు ప్రకటించినా..జనాలు మాత్రం పండుగలకు రెండో రోజుల ముందే సొంతూర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. ఈనెల 20న శుక్రవారం అర్ధరాత్రి నుంచి 21 శనివారం అర్ధరాత్రి వరకు 24 గంటల్లో యాదాద్రి జిల్లాలోని రెండు హైవేల మీదుగా 91,600 వెహికల్స్ రాకపోకలు సాగించాయి. హైదరాబాద్–విజయవాడ హైవేపై 60 శాతం వాహనాలు ప్రయాణించగా.. హైదరాబాద్–వరంగల్ హైవేపై 40 శాతం వెహికల్స్ ప్రయాణించినట్లు చౌటుప్పల్ లోని పంతంగి టోల్ గేట్, బీబీనగర్ లోని గూడూరు టోల్ గేట్ లెక్కల ద్వారా తేలింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి లక్షల మంది వేల ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల్లో తమ సొంతూర్లకు తరలివెళ్లారు.
ఆ రెండు హైవేలపై రయ్ రయ్
ఒకరోజుకు 86,400 సెకండ్లు ఉండగా.. ఈనెల 20న రాత్రి 12 నుంచి 21వ తేదీ రాత్రి 12 వరకు హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–వరంగల్ హైవేలపై కలుపుకొని మొత్తం 92,600 వెహికల్స్ ప్రయాణించాయి. 86,400 సెకండ్ల కంటే 5,200 వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగించాయి. ఈ లెక్కన శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ప్రతి సెకనుకు ఒకటి కన్నా ఎక్కువ వెహికిల్స్ ఈ హైవేల మీదుగా రాకపోకలు సాగించాయి. ఇక విజయవాడ హైవే మీదుగా నిమిషానికి 38 వెహికల్స్ ప్రయాణించగా, వరంగల్ హైవేపై నిమిషానికి 25 వాహనాలు రాకపోకలు సాగించాయి. అలాగే శనివారం అర్ధరాత్రి 12 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ 17 గంటల వ్యవధిలో 48 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి.
వెహికల్స్ ప్రయాణించిన లెక్క ఇది...
హైదరాబాద్-–విజయవాడ హైవేపై శుక్రవారం రాత్రి 12 నుంచి శనివారం రాత్రి 12 గంటల వరకు 55 వేల వెహికల్స్ రాకపోకలు సాగించాయి. వాటిలో కార్ల సంఖ్యే 80 శాతం ఉంది. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల సంఖ్య 20 శాతం మాత్రమే. అలాగే ఆదివారం సాయంత్రం వరకూ 26 వేల వెహికల్స్ రాకపోకలు సాగించాయి. హైదరాబాద్-–వరంగల్ హైవే పై శుక్రవారం రాత్రి 12 నుంచి శనివారం రాత్రి 12 వరకు 36,900 వాహనాలు రాకపోకలు సాగించాయి. వాటిలో 25 వేలకుపైగా కార్లు కాగా.. మిగిలినవి ఆర్టీసీ బస్సులు, ఇతర వెహికల్స్ ఉన్నాయి. అలాగే ఆదివారం సాయంత్రం వరకు 22 వేల వెహికల్స్ రాకపోకలు సాగించాయి.