వూహాన్ వాటర్‌‌ పార్కులో పార్టీ.. మాస్కులు లేకుండా వేలాది మంది హాజరు

వూహాన్ వాటర్‌‌ పార్కులో పార్టీ.. మాస్కులు లేకుండా వేలాది మంది హాజరు

బీజింగ్: కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. మహమ్మారి దెబ్బకు లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పేద దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితీ దాదాపుగా ఒకేలా ఉంది. వైరస్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఆ దిశగా అందరూ తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే మరోవైపు కరోనా పుట్టుకకు కారణంగా చెబుతున్న చైనాలోని వూహాన్‌లో పరిస్థితి మరోలా ఉంది. మొట్టమొదటి కరోనా కేసు వూహాన్‌లోనే రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వేలాది మంది ప్రజలు ఒక వాటర్‌‌ పార్క్‌లో గుమిగూడి పార్టీని ఆస్వాదిస్తూ సేద తీరడం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

పాపులర్ అయిన వూహాన్ మాయా బీచ్‌ వాటర్ పార్క్‌లో వేలాది మంది స్విమ్‌ సూట్స్‌ వేసుకొని ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేశారు. అందులో చాలా మంది రబ్బర్ ట్యూబులపై కూర్చోగా, మరి కొందరు ఛాతీ ఎత్తు వరకు నీళ్లలో నిలబడి సేదతీరారు. 76 రోజుల లాక్‌డౌన్ తర్వాత కఠిన నిబంధనల నడుమ జూన్‌లో ఈ వాటర్ పార్క్‌ను తిరిగి ఓపెన్ చేశారు. ఈ పార్క్‌ను 50 శాతం అటెండెన్స్‌తో నడుపుతున్నారు. ఫిమేల్ విజిటర్స్‌కు సగం ధరకే రావడానికి ఆఫర్ చేస్తున్నారని లోకల్ మీడియా ద్వారా తెలిసింది. రీసెంట్‌గా నిర్వహించిన పార్టీలో హాజరైన ప్రజలు లైఫ్ జాకెట్లు ధరించారు. కానీ ఎవరూ కూడా ఫేస్ మాస్కులు కట్టుకోకపోవడం గమనార్హం. వూహాన్‌లో ఏప్రిల్‌లో లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. తర్వాత ఈ మూడు నెలల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని సమాచారం. దీంతో లోకల్ ఎకానమీని పెంచుకోవడానికి హుబే సర్కార్ తమ ప్రావిన్స్‌లో 400 పర్యాటక ప్రాంతాలను ఉచితంగా చూడటానికి ప్రవేశం కల్పిస్తోంది.