మావోయిస్టు పేరుతో వ్యాపారికి బెదిరింపులు..రూ.5 కోట్లు డిమాండ్

మావోయిస్టు పేరుతో వ్యాపారికి బెదిరింపులు..రూ.5 కోట్లు డిమాండ్
  • వలపన్ని పట్టుకున్న పోలీసులు.. నిందితుడు ఆర్మీ జవాన్ గా గుర్తింపు

విజయనగరం: మావోయిస్టు దళ కమాండర్ పేరుతో బంగారం వ్యాపారిని బెదిరించి రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా-ఒడిశా-జార్ఖండ్ ప్రాంతాల మావోయిస్టు దళ కమాండర్ గా చెప్పుకున్న సీహెచ్ రాజేశ్వరరావు ఉత్తర్ ప్రదేశ్ లో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని స్వగ్రామం జిల్లాలోని పార్వతీపురం మండలం చినబంటువలస. గతంలో వ్యాపారం విషయంలో లక్షల రూపాయలు పోగొట్టుకున్న నిందితుడు రాజేశ్వరరావు.. నక్సలైట్ల పేరుతో బడా బాబులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లి రూ.30వేలు పెట్టి ఓ నాటు తుపాకీ కొన్నాడు. ఇటీవల ఆర్మీలో ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరుకు వచ్చాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజేశ్వరరావు పార్వతీపురం మండలానికి చెందిన బంగారం వ్యాపారి చినగుంపస్వామి అలియాస్ బాబుపై కన్నేశాడు. ఇతని వద్ద డబ్బులు వస్తాయని భావించి ఒకరోజు సాయంత్రం చీకటిపడ్డ తర్వాత బంగారం వ్యాపారి బాబు ఇంటి వద్దకు వెళ్లి ట్రయల్స్ గా రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. మరుసటి రోజు వ్యాపారి బాబుకు ఫోన్ చేసి తాను మావోయిస్టు దళకమాండర్ నని పరిచయం చేసుకున్నాడు. నిన్న రాత్రి మీ ఇంటి వద్ద తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపింది తానేననంటూ తెలియజేశాడు. మీపై కాల్పులు జరపకూడదంటే.. రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని.. ఇప్పటికిప్పుడు కోట్ల రూపాయలు తీసుకురాలేనని నిస్సహాయత వ్యక్తం చేశారు. 5 కోట్లకు బదులు కోటి రూపాయలు ఇవ్వగలనని.. అది కూడా కాస్త సమయం ఇస్తే అరేంజ్ చేస్తానని చెప్పాడు. వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి తనను ఎవరో బెదిరించారని.. డబ్బులివ్వాలంటున్నారని ఫిర్యాదు చేశారు. వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని పట్టుకునేందుకు నిఘా పెట్టారు. రెండుసార్లు అతని మాటలు రికార్డు చేశాక.. ఎవరితను... ఎక్కడి నుంచి చేస్తున్నాడని గుర్తించే ప్రయత్నం చేశారు. డబ్బును తీసుకుని అతను చెప్పిన అడ్రస్ కు వెళ్లగా.. డబ్బు కోసం వేచి ఉన్న రాజేశ్వరరావును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇతను ఆర్మీ జవానుగా తేలింది. అతని వద్ద నుండి ఒక దేశీయ పిస్టల్, 4 రౌండ్స్, మూడు మొబైల్ ఫోన్లు, మూడు ఖాళీ గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి మీడియా సమావేశం పెట్టి వెల్లండించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.  ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. ఈ మీడియా సమావేశంలో పార్వతీపురం ఓఎస్ది ఎన్.సూర్యచంద్ర రావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, ఎ ఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.