బాలుడు కిడ్నాప్.. రూ.12 లక్షలు డిమాండ్‌‌‌‌

బాలుడు కిడ్నాప్..  రూ.12 లక్షలు డిమాండ్‌‌‌‌
  • ముగురు అరెస్ట్‌‌‌‌, పరారీలో ఒకరు

హనుమకొండ, వెలుగు : డబ్బుల కోసం బాలుడిని కిడ్నాప్‌‌‌‌ చేసిన ఘటనలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను హనుమకొండ సీఐ మచ్చ శివ కుమార్‌‌‌‌ వెల్లడించారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా ఇల్లందకుంటకు చెందిన పూరి పద్మ హనుమకొండకు వచ్చి క్యాటరింగ్ చేసే రమణ వద్ద పని చేసేది. డబ్బుల విషయంలో పద్మ, రమణ మధ్య గొడవ జరిగింది. దీంతో రమణ అల్లుడైన బాలుడిని కిడ్నాప్‌‌‌‌ చేస్తే డబ్బులు వసూలు చేసుకోవచ్చని ప్లాన్‌‌‌‌ చేసింది. ఈ విషయాన్ని తన కొడుకులైన రాజు, శ్రీకాంత్‌‌‌‌తో పాటు బంధువైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగుబెల్లికి చెందిన జెట్టి జ్యోతికి చెప్పింది. 

ఈ నెల 4న బాలుడు నయీంనగర్‌‌‌‌ ప్రాంతంలో ఉండగా... ఆటోలో ఎక్కించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తీసుకెళ్లారు. తర్వాత బాలుడి తల్లికి ఫోన్‌‌‌‌ చేసి రమణ నుంచి డబ్బులు ఇప్పిస్తేనే బాలుడిని వదిలేస్తామంటూ చెప్పారు.డబ్బులు రావడం ఆలస్యం అవుతుండడంతో బాలుడిని కర్రలతో కొడుతూ పెట్రోల్‌‌‌‌ పోసి, కత్తితో పొడిచి చంపుతామంటూ బాలుడి తల్లికి ఫోన్‌‌‌‌ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో రమణను కూడా కిడ్నాప్‌‌‌‌ చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం హనుమకొండకు వచ్చి యాదవనగర్‌‌‌‌ మీదుగా ఆటోలో వెళ్తున్నారు. 

ఇదే సమయంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండడంతో వారిని చూసిన నిందితులు ఆటోను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే అలర్ట్‌‌‌‌ అయి పద్మ, జ్యోతి, రాజును పట్టుకోగా శ్రీకాంత్‌‌‌‌ పరార్‌‌‌‌ అయ్యాడు. నిందితులను రిమాండ్‌‌‌‌కు తరలించి, బాలుడిని అతడి తల్లికి అప్పగించినట్లు సీఐ వివరించారు. నిందితులని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ శివకుమార్, ఎస్సై కె.కిశోర్, ఏఏవో సల్మాన్‌‌‌‌పాషా, కానిస్టేబుల్స్‌‌‌‌ వి.అశోక్, డి.కరుణాకర్, బి.సతీశ్, వినూష, కారుణ్య, రవి, యుగేందర్‌‌‌‌ను ఉన్నతాధికారులు అభినందించారు.