- ఉప్పల్‌లో ముగ్గురు అరెస్ట్
ఉప్పల్, వెలుగు: నకిలీ పత్రాలతో ప్లాట్లు అమ్ముతున్న ముగ్గురిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటలోని మారుతీ నగర్‌కు చెందిన విజయ కుమారికి ఉప్పల్ విజయపురి కాలనీలో కట్నం కింద వచ్చిన 200 గజాల స్థలం ఉంది. ఆమె చనిపోయినట్లుగా చాటాల రమ్య, రంగా సతీశ్ గౌడ్, రచల వెంకటరమణ కలిసి నకిలీ డెత్, ఫ్యామిలీ సర్టిఫికెట్ పత్రాలు రెడీ చేశారు. ఆమె కూతురుగా చాటాల రమ్య నటించి వెంకటరమణ పేరు మీద ఈ భూమిని సేల్ డీడీ చేసింది. అనంతరం సతీశ్ గౌడ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది.
ఆ తర్వాత అందులోని 100 గజాల స్థలాన్ని చాకలి లక్ష్మి దేవి అనే మహిళకు అమ్మారు. మోసపోయానని గ్రహించి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు వీరి ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. గతంలో రంగా సతీశ్ గౌడ్, వెంకటరమణ కలిసి ఇలాగే పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో వీరికి సహకరించిన కార్తీక్ రెడ్డి అలియాస్ కార్తికేయ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
