
జగదేవ్పూర్(కొమురవెల్లి), వెలుగు: మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపూర్ కు చెందిన ఆలేటి యాదవరెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కుమార్తె అపర్ణ, వీరి ఇంటి సమీపంలో ఉండే అబ్బాస్ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఈ ఏడాది జనవరిలో బయటకు వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు తొలుత జనగాం, తర్వాత కుకునూరుపల్లిలో నివాసం ఉన్నారు.
3 నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు రావడంతో అపర్ణ పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత తనను తీసుకెళ్లమని భర్త అబ్బాస్‌కు ఫోన్‌చేయడంతో ఈ నెల 7న కారు తీసుకొని వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. కూతురు తిరిగి అబ్బాస్ తో వెళ్లిపోయిందని ఆగ్రహించిన యాదవరెడ్డి–నిర్మల దంపతులు, యాదవరెడ్డి తమ్ముడు రాంరెడ్డి అబ్బాస్తల్లి సైనా బేగంపై రాడ్డుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.