- ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తుల అరెస్ట్
- ఢిల్లీకి వెళ్లి అదుపులోకి తీసుకున్న చైతన్యపురి పోలీసులు
ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివారులో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర పాత నేరస్తులను ఢిల్లీలో చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎల్బీనగర్ డీసీపీ అనురాధ మంగళవారం తెలిపారు. ఢిల్లీకి చెందిన అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ అదే ప్రాంతంలో గతంలో ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేశారు.
ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన వీరిద్దరూ ఈ నెల 17న హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి పరిధిలో పల్సర్ బైక్‌పై తిరుగుతూ కేవలం గంట వ్యవధిలో మూడు స్నాచింగ్లకుపాల్పడ్డారు. పల్సర్‌బైక్‌ను కూడా అదే రోజు తెల్లవారుజామున గోపాలాపురం పీఎస్పరిధిలో దొంగతనం చేశారు. చైన్ స్నాచింగ్‌ల తర్వాత బైక్‌ను సికింద్రాబాద్‌లోని సంగీత థియేటర్ క్రాస్ రోడ్స్ సమీపంలో వదిలేసి ఢిల్లీకి పారిపోయారు.
ఈ ఘటనపై చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు నేతృత్వంలో పోలీసులు 3 స్పెషల్టీమ్లుగా ఏర్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, టవర్ డంప్ అనాలిసిస్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. ఒక టీమ్ఢిల్లీకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి మొత్తం 11తులాల 3 బంగారు ఆభరణాలతో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
దర్యాప్తులో కీలక విషయాలు
ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ శర్మ పై దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మొత్తం 21 కేసులు ఉండగా.. రోహిత్ పై 13 కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, నాగపూర్లలో నమోదయ్యాయని డీసీపీ తెలిపారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 9 కేసులు ఉన్నట్లు చెప్పారు. 2025 జూలైలో నాగ్‌పూర్ పోలీసులు వీరిని అరెస్ట్ చేయగా, జైలు నుంచి విడుదలైన వెంటనే హైదరాబాద్‌కు వచ్చి పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు.
నగల కోసమే అడ్డా కూలీ హత్య.. ఇద్దరు అరెస్ట్
వికారాబాద్, వెలుగు : బంగారం కోసం అడ్డా కూలీని దారుణంగా హత్య చేసిన ఇద్దరిని తాండూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య వివరాల ప్రకారం.. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంకల బందెమ్మ (54) బంగారంపై తోటి కూలీలైన మాల నర్సింహులు, కిశోర్ షిండే కన్నేశారు. ఈ నెల 21న ఓ ఫామ్‌హౌస్‌లో పని ఉందని నమ్మించి ఆమెను రేగొండి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు.
అనంతరం ఆమె వద్ద ఉన్న 30 తులాల వెండి కడియాలు, బంగారు గొలుసును దొంగిలించి శంకర్‌పల్లిలోని ఓ షాపులో రూ. 49 వేలకు అమ్మేశారు. లేబర్ అడ్డా వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను మంగళవారం పట్టుకొని విచారించగా నేరం అంగీకరించారు. మాల నర్సింహులు 2021లో యాలాల మండలంలోని రాస్నం గ్రామంలో లక్ష్మి అనే మహిళను ఇదే తరహా హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు.
