అనిల్‌‌ అంబానీకి చైనా చిక్కులు

అనిల్‌‌ అంబానీకి చైనా చిక్కులు

లండన్‌‌: ఆర్థిక సమస్యలు, కంపెనీల దివాలా వంటి పుట్టెడు సమస్యలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముకేశ్‌‌ అంబానీ తమ్ముడు అనిల్‌‌ అంబానీకి మరో కొత్త చిక్కు ఎదురైంది. తమకు బాకీపడ్డ 680 మిలియన్‌‌ డాలర్లు (దాదాపు రూ.4,853 కోట్లు) ఇప్పించాలని కోరుతూ మూడు చైనా బ్యాంకులు బ్రిటన్‌‌ కోర్టులో కొన్ని రోజుల క్రితం పిటిషన్‌‌ వేశాయి. ది ఇండస్ట్రియల్ అండ్‌‌ కమర్షియల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ చైనా లిమిటెడ్‌‌, చైనా డెవెలప్‌‌మెంట్‌‌ బ్యాంక్‌‌ (ఐసీబీసీ), ఎక్స్‌‌పోర్ట్‌‌–ఇంపోర్ట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ చైనా అనిల్‌‌పై న్యాయపోరాటాన్ని మొదలుపెట్టాయి. ఈ మూడు బ్యాంకులు అనిల్‌‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌‌ కమ్యూనికేషన్స్‌‌ లిమిటెడ్‌‌కు 925.2 మిలియన్‌‌ డాలర్ల లోన్‌‌ ఇవ్వడానికి 2012లో ఒప్పుకున్నాయి. ఇందుకు ఆయన పర్సనల్‌‌ గ్యారంటీ ఇవ్వాలని షరతు విధించామని ఐసీబీసీ లాయర్‌‌ బంకిమ్‌‌ థంకీ కోర్టుకు తెలిపారు. బాకీలో కొంత మొత్తం రిలయన్స్‌‌ కమ్యూనికేషన్స్‌‌ చెల్లించినా, 2017 ఫిబ్రవరి నుంచి చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి, డిఫాల్ట్‌‌ అయిందని తెలిపారు. దీనిపై అనిల్‌‌ అంబానీ స్పందిస్తూ ఈ అప్పులకు తాను నాన్‌‌–బైండింగ్‌‌ ‘పర్సనల్‌‌ కంఫర్ట్‌‌ లెటర్‌‌’ ఇవ్వడానికి ఒప్పుకున్నది నిజమే అయినా, పర్సనల్‌‌ గ్యారంటీ మాత్రం ఇవ్వలేదని వాదించారు.

అన్న ఎదిగాడు.. తమ్ముడు తగ్గాడు

అన్న ముకేశ్‌‌ అంబానీ 56 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థాయికి ఎదగగా, అనిల్‌‌ అంబానీ ఆస్తి మాత్రం వేగంగా తగ్గిపోయింది. ఆయనకు కనీసం బిలియనీర్‌‌ (రూ.100 కోట్ల ఆస్తి) హోదాను కూడా కోల్పోయారు. ఆర్‌‌కామ్‌‌ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఈ ఏడాదే దివాలా కోర్టులో పిటిషన్‌‌ వేసింది. అనిల్‌‌కు టెలికం నుంచి ఇన్‌‌ఫ్రా వరకు ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ.. అవన్నీ అప్పులతో తిప్పలు పడుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి అనిల్‌‌ గ్రూపులోని నాలుగు పెద్ద యూనిట్ల అప్పు విలువ రూ.9,300 కోట్లకు చేరింది.  అనిల్‌‌ అంబానీకే చెందిన రిలయన్స్‌‌ క్యాపిటల్‌‌ రేటింగ్‌‌ను కేర్‌‌ రేటింగ్స్‌‌ ‘డిఫాల్ట్‌‌’కు తగ్గించింది.  ముంబై కేంద్రంగా పనిచేసే రిలయన్స్‌‌ క్యాపిటల్‌‌ ఆస్తులను అమ్మి అప్పులను తీర్చడానికి గత ఏడాది నుంచి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో కంపెనీ కొంతమేరకే విజయం సాధించింది. దీంతో షేరు ధర 90 శాతానికిపైగా పడిపోయింది.    స్వీడన్‌‌ కంపెనీ ఎరిక్సన్‌‌కు బకాయిపడ్డ రూ.550 కోట్లను చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని  కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముకేశ్‌‌ సాయం చేయడంతో ఆ సమస్య నుంచి అనిల్‌‌ బయటపడ్డారు. అనిల్‌‌ హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీని ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టడంతో ఇది కొత్త పాలసీలు ఇవ్వకుండా ఐఆర్‌‌డీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తండ్రి ధీరూబాయ్‌‌ అంబానీ మరణం తరువాత ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు పెరిగాయి. దీంతో వ్యాపారాలను పంచుకున్నారు. ముకేశ్‌‌ ఆయిల్‌‌, పెట్రోకెమికల్స్ వ్యాపారాలు దూసుకుపోగా, అనిల్‌‌ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి.

పర్సనల్‌‌ గ్యారంటీపై వివాదం

అనిల్‌‌ అంబానీ చైనా బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోవడానికి 2011లో బీజింగ్‌‌ వెళ్లి ఐసీబీసీ మాజీ చైర్మన్‌‌ జియాంగ్‌‌ జియాన్‌‌కింగ్‌‌తో చర్చించారు. అయితే అనిల్‌‌ షేర్లను కుదువబెడితే లోన్లు ఇస్తామని బ్యాంకులు షరతు పెట్టాయి. అయితే లోన్లకు ఆయన పర్సనల్‌‌ గ్యారంటీ ఇవ్వాలా లేదా ? అనే విషయమై చర్చోపచర్చలు నడిచాయి. అనిల్‌‌ తరఫున రిలయన్స్‌‌ కమర్షియల్‌‌ హెడ్‌‌ హాసిత్‌‌ శుక్లా పర్సనల్ గ్యారంటీ డాక్యుమెంట్లపై సంతకాలు చేశారని ఐసీబీసీ లాయర్‌‌ థంకీ వాదిస్తున్నారు. దీనిపై అనిల్‌‌ న్యాయవాది రాబర్ట్‌‌ హోవ్‌‌ స్పందిస్తూ హాసిత్‌‌కు సంతకం చేసేందుకు తన క్లయింట్‌‌ అధికారం ఇవ్వలేదని చెప్పారు. ఈ మూడు లోన్ల తరఫున ఐసీబీసీ న్యాయవాదే లండన్‌‌ కోర్టులో వాదిస్తున్నారు. ఈ కేసులో త్వరగా నిర్ణయాన్ని వెలువరించాలని ఐసీబీసీ… జడ్జి డేవిడ్‌‌ వాక్స్‌‌మన్‌‌ను కోరింది. బకాయిమొత్తాన్ని వడ్డీతో కలిపి కోర్టులో అనిల్‌‌ డిపాజిట్‌‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. తన సంపద గురించి అనిల్ అంబానీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదు. కోర్టు నిర్ణయంపై పారిశ్రామికవర్గాల్లో ఆసక్తి నెలకొంది.