మూడు ఫీట్ల దూరం రూల్ బేఖాతర్: రేషన్ షాపుల దగ్గర గుంపు

మూడు ఫీట్ల దూరం రూల్ బేఖాతర్: రేషన్ షాపుల దగ్గర గుంపు

ఉచిత బియ్యం కోసం రేషన్‌‌ షాపులకు వస్తున్న జనం గుంపులు గుంపులుగా జమయితున్నరు. సోషల్డిస్టెన్సింగ్ పాటించడం లేదు. లాక్‌‌డౌన్‌‌ ఉన్నందున పేదలకు ప్రభుత్వం ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ చేపట్టి ఐదు రోజులైనా రష్ తగ్గడం లేదు. ఏ రేషన్‌‌ షాపు చూసినా జనాలే కనిపిస్తున్నారు. కనీసం మూడు ఫీట్లడిస్టెన్స్ పాటించాలని ప్రచారం చేసినా అది అమలు కావడం లేదు.

చెప్పినా పట్టించుకోవట్లే ..

హైదరాబాద్‌‌తో పాటు ఇతర సిటీల్లో ఏ రేషన్‌‌ షాపు చూసినా ఉదయం నుంచి జనాలు బారులు తీరి ఉంటున్నారు. ప్రతి డీలర్‌‌ రోజుకు ఆడోళ్లకు 50, మగవాళ్లకు 50 టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు ఇచ్చే సమయంలో జనాలు భారీగా తరలివచ్చి కొట్లాడి మరీ తీసుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో ఎవరికైనా వైరస్‌‌ ఉంటే అది అందరికీ చుట్టుకునే ప్రమాదం ఉంది. బయోమెట్రిక్ లేకుండానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు రేషన్‌‌ షాపుల దగ్గర రెండు లైన్లు చొప్పున మూడు ఫీట్లలో ఉండేలా సున్నంతో బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే వాటిలో జనాలు నిలబడడం లేదు. బాక్సులో సంచులు లేదా చెప్పులు పెట్టి ఓ దగ్గర గుమిగూడి కూర్చుంటున్నారు. రేషన్‌‌ తీసుకుంటేనే రూ.1500 ఇస్తారన్న పుకార్లతో ఒకేసారి జనం తరలిరావడంతో పెద్ద సమస్యగా మారిందని, పోలీసులను పెడితే కానీ సెట్‌‌ అయ్యే పరిస్థితి లేదని రేషన్‌‌ డీలర్లు అంటున్నరు .మైక్‌‌ పెట్టి అరిచినా పట్టించుకోవడం లేదని, మాస్కులూ పెట్టుకోవడం లేదని వాపోతున్నారు.

నేతలతో పరేషాన్..

రేషన్‌‌ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించడంలో పల్లె ప్రజలే కొంత మెరుగ్గా ఉన్నారు. మరో వైపు రేషన్ షాపులకు ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల తాకిడి పెరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. దీంతో జనాలు గుమిగూడి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది.