
- ఏపీకి చెందిన ముగ్గురు అరెస్ట్ .. పరారీలో మరొకరు
- నల్గొండ జిల్లా చౌటుప్పల్ పోలీసుల వెల్లడి
చౌటుప్పల్, వెలుగు : కారు, నగదు కొట్టేసిన ముగ్గురి ముఠాను నల్గొండ జిల్లా చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వేముల పుల్లారావు అలియాస్ శివ, పిడుగురాళ్లకు చెందిన మిద్దె జగదీశ్‌బాబు, కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన కార్వాల సునీల్ కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. కార్ల కొనుగోలు, అమ్మకాలు చేస్తామంటూ ఫేస్ బుక్ లో ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని నాగోల్ కి చెందిన వీరగంధం శ్రీనివాస్ కార్లు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. వీరికి శ్రీనివాస్ పరిచయమవగా.. కారు అమ్మకానికి ఉందని చెప్పి రూ. 4 లక్షలు తీసుకురావాలని ముగ్గురూ సూచించారు. ఈనెల 26న యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు కారులో డబ్బులు తీసుకుని వెళ్లాడు.
అక్కడ శ్రీనివాస్ కారులో పుల్లారావు ఎక్కి బస్టాండ్ వద్ద మసీదు పక్కన కారు ఉందని, ఓనర్ బయట నుంచి వస్తున్నాడని నమ్మించి తీసుకెళ్లాడు. అక్కడి వెళ్లాక శ్రీనివాస్ కు ఫోన్ రాగా.. మాట్లాడేందుకు కిందకు దిగాడు. వెంటనే ఆ కారుతో పాటు డబ్బులను పుల్లారావు తీసుకుని వెళ్తూ.. కొద్ది దూరంలో ఉన్న సునీల్ కుమార్, జగదీశ్ ఎక్కి పారిపోయారు. శ్రీనివాస్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. సోమవారం నిందితులు పుల్లారావు, సునీల్ కుమార్, జగదీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు బత్తుల సాంబశివరావు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద రూ. 4 లక్షల నగదు, ఐదు గ్రాముల గోల్డ్ బిస్కెట్, మొబైల్ ఫోన్లు, రెంట్ కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితులు ఫేక్ నోట్లు, ఫేక్ గోల్డ్ కేసుల్లో అరెస్ట్ అయినట్టు సీఐ తెలిపారు.