చైనాను భయపెడుతున్న త్రీగోర్జెస్ డ్యామ్

చైనాను భయపెడుతున్న త్రీగోర్జెస్ డ్యామ్

చైనాలో అతిపెద్ద నీటినిల్వ కలిగిన డ్యామ్… ​ త్రీగోర్జెస్​. మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ. ఈ డ్యామ్​ నిత్యం జలకళ ఉట్టిపడుతూ..అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఒకటి. అయితే వారం రోజులుగా ఇక్కడ వరద బాగా పెరిగిపోయింది. యాంగ్జీ పరివాహక ప్రాంతంలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో ఉన్న 71 మీటర్ల బుద్ధ విగ్రహం కాళ్లను నది నీళ్లు తాకాయి. 1949 తర్వాత ఈ స్థాయికి నీరు ఎప్పుడూ చేరలేదు. ఇప్పటికే దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి తోడు డ్యామ్‌ దగ్గర భారీగా నీరు నిలవడంతో బ్యాక్‌ వాటర్‌‌ ప్రాంతలు కూడా నీటమునిగాయి.

అంతేకాదు ఈ డ్యామ్‌ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇక్కడ వరద పెరిగిన సమయంలో దిగువకు విడుదల చేసే నీటి దెబ్బకు లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. భారీగా పంటలు మునిగిపోతున్నాయి. ఒకసారి డ్యామ్‌ కూలి లక్షల మంది చనిపోయిన చరిత్ర చైనాకు ఉంది. ఈ సారి అదే పునరావృతం అవుతుందేమోనని ఆందోళన పడుతోంది. త్రీగోర్జెస్‌ డ్యామ్‌ ప్రారంభించిన ఏడాదే కొండచరియలు విరిగి పడి 24 మంది మరణించారు. ఇప్పుడు వరదలు ఎన్నడూ చూడని స్థాయిలో వస్తున్నాయి. ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు తలెత్తినా చైనాలో జలప్రళయం తప్పదు.

ఈ ఏడాది యాంగ్జీ నది బేసిన్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలోకి ఎన్నడూలేనంతగా వరద వస్తోంది. 2003లో ఈ డ్యామ్‌ పూర్తైన తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో నీరు చేరింది. గురువారం ఉదయం 8 గంటల నాటికి సెకన్‌కు 73,000 క్యూబిక్‌ మీటర్ల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ విషయాన్ని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపాయి. ఈ డ్యామ్​ చరిత్రలోనే ఇది అత్యధికం.

ఈ నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 40 కోట్ల మంది చైనీయులు నివసిస్తున్నారు. ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువ. ఈ నెలలో 9 కోట్ల మంది వరదకు ప్రభావితమయ్యారు. 2.5లక్షల ఎకరాలు నీటమునిగిపోయాయి. జూన్‌ నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు డ్యామ్‌ గేట్లను ఎత్తారు. అయినప్పటికీ నీటి మట్టం ఏమాత్రం తగ్గడంలేదు.

ఈ డ్యామ్‌పై భాగంలోని మూడు మరో డ్యామ్‌లు కూడా దీని‌ పరిధిలోనే ఉంటాయి. ఇక్కడ వందేళ్లలో ఒక సారి వచ్చే వరదల తీవ్రత ఎంతగా ఉంటుందంటే 244 బిలియన్‌ క్యూబిక్‌ మీ‌టర్ల నీరు వస్తుంది. ఈ వరదలో కేవలం 9 శాతం మాత్రమే ఈ డ్యామ్‌లో నిల్వ చేయగలరు. అంటే మిగిలిన నీరు రెండు మూడు నెల్లలో కిందకు వదలాల్సిందే.