న్యూఢిల్లీ: పంజాబ్ నుంచి ఇరాన్‌కు వెళ్లిన ముగ్గురు మనోళ్లు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా ధృవీకరించింది. తప్పిపోయిన ముగ్గురిని హుషన్‌ప్రీత్ సింగ్, జస్పాల్ సింగ్, అమృత్‌పాల్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. పంజాబ్‌లోని సంగ్రూర్, హోషియార్పూర్, ఎస్‌బీఎస్ నగర్ నుంచి ఇరాన్‌కు వచ్చిన ముగ్గురు యువకులు మే 1న టెహ్రాన్‌లో దిగిన కాసేపటికే కనిపించకుండాపోయారని, వారిని వెతికే పనిలో ఉన్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. వారి ఆచూకీని అత్యవసరంగా కనిపెట్టాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
కాగా, హుషన్ ప్రీత్ తల్లి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని, టెంపరరీగా ఇరాన్‌లో అకామిడేషన్ ఇస్తానని ఓ ఏజెంట్ చెప్పడంతో ముగ్గురు ఇక్కడినుంచి బయల్దేరారని తెలిపారు. ఇరాన్ చేరుకున్న తమవాళ్లను ఆ ఏజెంటే కిడ్నాప్ చేయించి ఉంటాడని ఆరోపించారు. ముగ్గురినీ విడిచిపెట్టాలంటే రూ.కోటి ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. యువకులను తాళ్లతో కట్టేసి, వాళ్ల చేతుల నుంచి రక్తం కారుతున్నట్లున్న వీడియో తనకు కిడ్నాపర్లు పంపించారని తెలిపారు.
