ఎండ్లబండిపై పిడుగుపడి ముగ్గురి దుర్మరణం

ఎండ్లబండిపై పిడుగుపడి ముగ్గురి దుర్మరణం

చేను పని చేసుకుని ఎడ్ల బండిపై ఇంటికొస్తుండగా పిడుగు పడడంతో ముగ్గురు చనిపోయారు. ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో జరిగిందీ ఘటన.

కాగ జ్ నగర్, వెలుగు: పిడుగుపాటు రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంబీకుల కళ్లముందే ముగ్గురిని బలితీసుకుంది. తన బండిలో స్థలం లేదని మరో బండిపై భార్య కూతురిని ఎక్కిస్తే.. ఐదు నిమిషాలు కూడా గడవకముందే వారిద్దరు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బోరుకుటి పున్నయ్య(55),  అతని భార్య రసిక, కొడుకు బాలాజీ, మరో కుటుంబం డోంగ్రే హోక్తు, అతని భార్య పద్మ(45), డిగ్రీ చదువుతున్న కూతురు శ్వేత(19) వేర్వేరుగా ఎడ్లబండ్ల మీద ఉదయం పంట చేలకు వెళ్లారు. అక్కడ ఎవరి చేనులో వారు పనులు చేసుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. దీంతో ఎడ్లబండ్ల మీద అంతా ఇంటికి బయలుదేరారు. హోక్తు బండిలో ఎరువులు ఉండడంతో భార్య, కూతురిని బాలాజీ బండి మీద ఎక్కించారు. హోక్తు ముందు బయలుదేరగా బాలాజీ వెనక వెళ్తున్నారు. పదడుగుల దూరం కూడా వెళ్లకముందే బాలాజీ ఎడ్లబండిపై పిడుగు పడింది. బండిపై ఉన్న అందరూ కింద పడిపోయారు. పున్నయ్య, పద్మ, శ్వేత రోడ్డుకు అటుపక్క, ఇటుపక్క పడి ప్రాణాలు వదిలారు. బాలాజీ, రసికకు ప్రాణాపాయం తప్పింది. ఎద్దు కూడా అక్కడికక్కడే చనిపోయింది. కళ్లముందే కుటుంబ పెద్దను కోల్పోయి ఇద్దరు, భార్య, బిడ్డను కోల్పోయి ఒకరు విషాదంలో మునిగిపోయారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్​ మునావర్​షరీఫ్, ఎంపీపీ విశ్వనాథ్, ఎస్సై ఆంజనేయులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. డెడ్​బాడీలను సిర్పూర్​సివిల్​ఆస్పత్రికి తరలించారు.