V6 News

 ముగ్గురు ఆర్​పీసీ సభ్యుల అరెస్ట్

 ముగ్గురు ఆర్​పీసీ సభ్యుల అరెస్ట్

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ దండకారణ్యంలోని రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ (ఆర్​పీసీ) కి చెందిన ముగ్గురు సభ్యులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వెంకటచెరువు గ్రామ అటవీ ప్రాంతంలో  పోలీసులు, స్పెషల్​ పార్టీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆర్​పీసీ సభ్యులను శనివారం అరెస్ట్  చేశామని భద్రాచలం ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ ప్రకటించారు.

ఛత్తీస్​గఢ్​లోని బీజాపూర్  జిల్లా ఊసూర్​ ఠాణా పరిధిలోని చిన్న  ఊట్లపల్లికి చెందిన మడివి గంగ, రాంపూర్​ గ్రామానికి చెందిన మడివి అంద, బీమారం గ్రామానికి చెందిన కొవ్వాసి మంగులు.. మావోయిస్టు పార్టీ నిర్వహించే సమావేశాలకు ఆదివాసీలను తరలించడంతో పాటు, వారిని బెదిరించి మావోయిస్టులకు నిత్యావసర సరుకులను తీసుకెళ్తున్నారని ఏఎస్పీ తెలిపారు. దండకారణ్యం బెటాలియన్​ కమాండర్​ హిడ్మా, తెలంగాణ రాష్ట్ర అగ్ర నాయకులు దామోదర్, ఆజాద్, మధు, అరుణ, లచ్చన్న, మంగు, అర్జున్​ తదితరుల కోసం ఆ ముగ్గురు పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలను బహిష్కరించాలని గ్రామాల్లో కరపత్రాలు పంచేందుకు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ వెల్లడించారు.