ఒకే కుటుంబంలో ముగ్గురు సూసైడ్..అనారోగ్య కారణాలతోనేనని సూసైడ్ నోట్

ఒకే కుటుంబంలో ముగ్గురు సూసైడ్..అనారోగ్య కారణాలతోనేనని సూసైడ్ నోట్
  • గౌలిదొడ్డి జయభేరి నిర్వాణ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువు గ్రామానికి చెందిన బత్తుల మార్రెడ్డి(65), భారతి(60) దంపతులు తమ కుమారుడు నిశాంత్ రెడ్డి(38)తో కలిసి గచ్చిబౌలిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఏడో అంతస్తు.. ప్లాట్ నంబర్ 702లో నివాసం ఉంటున్నారు.

నిశాంత్ రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయనకు తన భార్యతో మనస్పర్థలు రావడంతో మూడు నెలల క్రితం కుమారుడిని తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నిశాంత్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొద్ది నెలలుగా నిశాంత్ మానసిక రుగ్మతతో బాధపడుతుండగా తల్లిదండ్రులు చికిత్స అందిస్తున్నారు. నిశాంత్ తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య సమస్యలు రావడం, కుమారుడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ముగ్గురు కలిసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

వీరికి ప్రతిరోజూ టిఫిన్ తీసుకొచ్చే ఓ హోటల్ సిబ్బంది ఆదివారం ఉదయం  ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు వచ్చి చూసేసరికి ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు. ఆ యువకుడు వెంటనే అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్యూరిటీకి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంట్లో ఉన్న సూసైడ్ నోట్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.