శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

 శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  శివబాలకృష్ణ బంధువులైన గోదావర్తి సత్యనారాయణ మూర్తి,పెంట భరత్ కుమార్,పెంట భరణి కుమార్ లను ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురు శివ బాలకృష్ణకి బినామీలుగా ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ముగ్గురు నిందితులని నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో హాజరు పరచగా..  వారికి న్యాయమూర్తి14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.  అనంతరం ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు.  కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసి జనవరి 25న   అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన సోదరుడు శివ నవీన్ ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. 

నిర్ణీత 60 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయకపోవడంతో శివబాలకృష్ణకు ఏప్రిల్ 03న ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివబాలకృష్ణను కోర్టు ఆదేశించింది. ఆయన సోదరుడు శివ నవీన్‌కు సైతం బెయిల్‌ను ఇచ్చింది.