ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలోని జిల్లా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మరణించడంతో హాహాకారాలు, ఆర్తనాదాలతో జిల్లా ఆసుపత్రి శోకసంద్రంలో మునిగిపోయింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆసుపత్రిలోని మూడవ అంతస్తులో ఉన్న నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఈ మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొందరు శిశువులను రక్షించారు.
#WATCH | Amravati, Maharashtra: Three newborn babies lost their lives after a fire broke out in the Neonatal Intensive Care Unit (NICU) of the District Women’s Hospital. According to preliminary information, the fire erupted at around 3.30 am on the third floor of the hospital,… pic.twitter.com/fhSQvykujw
— ANI (@ANI) August 24, 2026
ఆసుపత్రి సిబ్బంది వార్డు నుంచి పలువురు శిశువులను కాపాడినప్పటికీ ముగ్గురు ముక్కు పచ్చలారని నవ జాత శిశువులు ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. మెరుగైన చికిత్స కోసం ఆరుగురు శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం అనంతరం.. ఆసుపత్రికి సంబంధించిన వీడియోలు చూస్తే.. కాలిపోయిన పరికరాల అవశేషాలు, నల్లబడిన గోడలు కనిపించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తును మొదలుపెట్టారు. అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు ప్రాథమిక విచారణలో అగ్ని ప్రమాదానికి కారణంగా తెలిసిన విషయం ఏంటంటే.. 39 మంది నవజాత శిశువులకు NICUలో వైద్యం అందిస్తున్నారు. నవ జాత శిశు విభాగంలోని వెంటిలేటర్ పేలడం వల్ల ఆసుపత్రిలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 39 మంది నవ జాత శిశువుల్లో ముగ్గురు శిశువులు తీవ్రంగా కాలిన గాయాల వల్ల చనిపోయారు. ఆరుగురికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల మిగిలిన నవజాత శిశువుల ప్రాణాలను కాపాడగలిగారు.
