
మునుగోడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై అందరి దృష్టి నెలకొంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన బీజేపీలో చేరడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతుండగా... తామే గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కనీసం లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో విబేధాలు పొడ చూపుతుండడంతో పార్టీ సందిగ్ధంలో పడిపోయింది. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడిపోయింది.
టీఆర్ఎస్ బహిరంగసభ...
ఈ నెల 20న నిర్వహించే సీఎం KCR బహిరంగ సభతో.. సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేరికలపై దృష్టి పెట్టారు నేతలు. నియోజకవర్గంలో లక్షా 50 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులున్నట్లు లెక్కలు తీశారు. దళితబంధు జాబితా సిద్ధం చేశారు. మునుగోడు సెగ్మెంట్ లోని మండలాలకు 4 లైన్ రోడ్ కనెక్టివిటీకి ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ నిరాకరణ.. పార్టీ ముఖ్యనేతలను పరేషాన్ చేస్తోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పని చేసేది లేదని తెగేసి చెబుతున్నారు కొందరు స్థానిక నేతలు. స్థానిక అసంతృప్త నేతలను మంత్రి జగదీష్ బుజ్జగించే పనిలో ఉన్నారు.
21ను మునుగోడులో బీజేపీ సభ...
బైపోల్స్ లో కొనసాగుతున్న హవాను కంటిన్యూ చేసి.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయమని చాటేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మునుగోడులోనూ తమదే విజయమని తెగేసి చెబుతున్నారు. 21న మునుగోడులో అమిత్ షా సభను బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి తరుణ్ చుగ్ కన్ఫామ్ చేశారు. అటు అమిత్ షా సభ తర్వాత ముఖ్యనేతలంతా మునుగోడులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం జనగామలో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 21న మునుగోడులో జరగనున్న అమిత్ షా బహిరంగ సభపై చర్చించనున్నారు. బహిరంగ సభలో చేరికలు, జనసమీకరణపై చర్చ జరగనుంది.
సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహం
మునుగోడు సిట్టింగ్ సీటును ఎలాగైనా గెల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే గ్రామాలు, మండలాల వారీగా ఇంచార్జీలను నియమించింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్.. గాంధీభవన్ లో మునుగోడు నియోజకవర్గ వ్యూహరచన కమిటీతో సమావేశమయ్యారు. భేటీకి AICC కార్యదర్శలు హాజరయ్యారు. మునుగోడులో ఇతర పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఉప ఎన్నిక వ్యూహంపైనా పార్టీ నేతలతో డిస్కస్ చేస్తున్నారు. మునుగోడు బై పోల్ తోపాటు పార్టీ అంతర్గత విషయాలపై డిస్కస్ చేయనున్నారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల ఇంఛార్జీలతో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షులతో ఆజాది కా గౌరవ్ సమీక్షలో ఠాగూర్ పాల్గొంటారు. రేపు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాణిక్కం ఠాగూర్ మరోసారి సమావేశం కానున్నారు. మునుగోడుకు ఒక కమిటీని నియమించాలని బీజేపీ భావిస్తోంది. సామాజికవర్గాల వారిని అందులో నియమిస్తారని సమాచారం. ఎన్నికల నాటికి పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాలని కసరత్తులు జరుపుతోంది.