
- ఫేక్ డాక్యుమెంట్స్‌తో మోసాలు
- ముగ్గురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు : ఫేక్ డాక్యుమెంట్స్ తో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన విశాల్ మోహన్ కాప్సేకు ఆగస్టు 9న ఢిల్లీకి చెందిన ఇండియా బుల్స్ కంపెనీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీరు కంపెనీ నుండి తీసుకున్న పర్సనల్లోన్కు సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కట్టాలని తెలిపారు. దీంతో అవాక్కైన విశాల్ మోహన్ తనది ఢిల్లీ కాదని తాను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నానని, అసలు తాను ఇండియా బుల్స్ కంపెనీలో పర్సనల్‌లోన్ కోసం అప్లై చేయలేదని కంపెనీ ప్రతినిధులకు తెలిపాడు. అనంతరం తన సిబిల్ చెక్ చేసుకోగా తన పేరు మీద ఆగస్టు 9న ఇండియా బుల్స్ కంపెనీలో రూ. 13,55,500 పర్సనల్ లోన్‌ను తీసుకున్నట్లు ఉంది. ఢిల్లీలోని మునిర్కా సీ 14 అడ్రస్ పేరిట జూన్ 25వ తేదిన లోన్‌కు అప్లై చేసినట్లు విశాల్ మోహన్ గుర్తించాడు. తన పేరుపై తప్పుడు అడ్రస్ క్రియేట్ చేసి పర్సనల్ లోన్ తీసుకున్నట్లు విశాల్ మోహన్ గుర్తించి సెప్టెంబర్ 3న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అశ్రయించాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధు మోహన్ కేసు దర్యాప్తు చేపట్టారు.
ఫేక్ పాన్‌కార్డులు
ఢిల్లీకి చెందిన హిమాన్షు ఖన్నా డాటా ప్రొవైడర్ల నుంచి ప్రజలకు సంబంధించిన పాన్ కార్డులను సేకరిస్తాడు. అనంతరం పాన్ కార్డులో ఫొటో, అడ్రస్‌లు మార్చి వాటి సహాయంతో యాక్సిస్, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో అక్కడి బ్యాంకు అధికారుల సహాయంతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాడు. అనంతరం ధని యాప్ ద్వారా పర్సనల్ లోన్ కోసం ఇండియా బుల్స్ కంపెనీలో వివిధ పేర్లతో అప్లై చేస్తాడు. ఇలా 2018 నవంబర్ నుండి ఇప్పటి వరకు హిమాన్షు ఖన్నా 22 పాన్ కార్డులు ఉపయోగించి ధని యాప్ ద్వారా ఇండియా బుల్స్ కంపెనీలో పర్సనల్ లోన్స్‌కు అప్లై చేశాడు. పోలీసుల దర్యాప్తులో హిమాన్షు బ్యాంకుల్లో పనిచేసే గౌరవ్‌కుమార్, దీపక్కుమార్ల సహాయంతో దాదాపు రూ. 73,50,000 వరకు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పర్సనల్ లోన్ తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నవంబర్ 29వ తేదీన నిందితుడు హిమాన్షుతో పాటు అతనికి సహకరించిన బ్యాంకర్లు గౌరవ్‌కుమార్, దీపక్కుమార్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడి వద్ద నుండి మూడు సెల్‌ఫోన్స్, పాన్‌కార్డులు, ఓటర్ ఐటీ కార్డులు, చెక్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.