
డెహ్రాడూన్: కేదారనాథ్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ముగ్గురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.చార్ ధామ్ యాత్రలో భాగంగా వెళుతుండగా ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు యాత్రికులు కొండచరియల కింద చిక్కుకుని చనిపోగా, మరొకరు గాయపడినట్లు తెలిసింది. ప్రాణాలు కోల్పోయిన వారిని అరుణ్ పరటె (31) (నాగ్పూర్), సునీల్ మహదేవ్ కాలే (24) (మహారాష్ట్ర), అనురాగ్ బిస్త్గా (రుద్రప్రయాగ్) పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రజ్వర్ మీడియాకు తెలియజేశారు. ఆదివారం ఉదయం 7.30కు ఎమర్జెన్సీ కంట్రోల్ రూంకు రిపోర్ట్ వచ్చిందని.. కేథార్నాథ్ యాత్ర మార్గంలోని ఛిర్బస సమీపంలో యాత్రికులు కొండచరియల కింద చిక్కుకున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎనిమిది మంది యాత్రికులను కాపాడారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ ముగ్గురు యాత్రికులను కాపాడలేకపోయారు.
ఈ ఘటనతో కేథార్నాధ్ యాత్ర కాస్తంత నెమ్మదించింది. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా చూసుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో గడచిన కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి ఇలాంటి దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. బద్రీనాథ్ హైవేపై కూడా కొండచరియలు విరిగిపడుతుండటంతో యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.