ప్రమాదం తర్వాత మేం కలుసుకోవటానికి కొన్ని గంటలు పట్టింది

ప్రమాదం తర్వాత మేం కలుసుకోవటానికి కొన్ని గంటలు పట్టింది

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు  కుటుంబ సభ్యులు(సుబ్రొతో పాల్, దేబోశ్రీ పాల్ వీరి కుమారుడుతో పాటు) సురక్షితంగా బయటపడి పశ్చిమ బెంగాల్‌లోని తమ ఇంటికి చేరుకున్నారు. వీరిది పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌ గ్రామం. ఈ రైలు ప్రమాదం జరగడానికి ముందు వారు తమ కొడుకును డాక్టర్‌కు చూపించడానికి చెన్నైకి తీసుకువెళుతున్నారు. ఈ సంఘటన తర్వాత దేవుడు తమకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా భావిస్తున్నానని సుబ్రొతో పాల్ అన్నారు. 

ప్రమాదం జరిగినప్పుడు కంపార్ట్‌మెంట్ మొత్తం పొగతో నిండిపోయిందని, తాను ఎవరినీ చూడలేకపోయానని తెలిపాడు. స్థానిక ప్రజలు తనకు సహాయం చేయాడానికి వచ్చారని తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత తమ కుటుంబ సభ్యులను  కలుసుకోవటానికి కొన్ని గంటలు పట్టిందని చెప్పాడు.  

ఇక  ప్రమాదం జరిగినప్పుడు తాను చూసిన దృశ్యాలు ఇప్పటికీ తన మదిలో మెదలుతున్నాయని అతని భార్య  దేబోశ్రీ పాల్ తెలిపారు.  ఈ ప్రమాదం నుంచి తాము ఎలా బయటపడ్డామో తమకు తెలియదని,  ఇది మాకు రెండో జీవితం లాంటిదని చెప్పింది. తాను బతికున్నంత వరకు ప్రమాద దృశ్యాలు తన మదిలో నుంచి వెళ్లవని తెలిపింది.  

మరోవైపు ఈ  ఘటనలో మొత్తం 278 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.  ఏడు NDRF బృందాలు, 5 ODRAF యూనిట్లు , 24 ఫైర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ యూనిట్లు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. క్షతగాత్రులను సోరో, బాలాసోర్, భద్రక్ , కటక్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్నారు.