మారుమూల పల్లెలకు త్రీఫేజ్​ కరెంట్!

మారుమూల పల్లెలకు  త్రీఫేజ్​ కరెంట్!
  •     పరిష్కారం దిశగా 50 ఏండ్ల సమస్య
  •     అటవీ, విద్యుత్ శాఖల మధ్య కుదిరిన సయోధ్య
  •     అటవీశాఖకు 20 ఎకరాల భూమిని అప్పగించేందుకు అంగీకారం


నిర్మల్,  వెలుగు : ఐదు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న మారుమూల పల్లెల త్రీఫేజ్​ కరెంట్ సమస్య ఎట్టకేలకు పరిష్కారం కాబోతోంది. అటవీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. ఇటీవలే ఈ మూడు శాఖల ఉన్నతాధికారులు మారుమూల పల్లెల్లో త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం అందించేందుకు అవసరమైన చర్యలపై సమీక్షించారు. 
కడెం, పెంబి మండలాల్లోని 16 గ్రామాలు 50 ఏండ్లుగా త్రీఫేజ్ కరెంట్ సౌకర్యానికి నోచుకోలేదు. పెంబి మండలంలోని జీడిమెట్ల తండా, గొరిపెద్దయ్య గూడెం, కొరకంటి, ఇంగ్లాపూర్, వడ్డిగూడ, కోసుగుట్ట, కొత్తగూడ, పెద్ది రాగిదుబ్బ, గోధుమల, సోముగూడ, రామగూడ, సాకిగూడ, జంగుగూడతోపాటు కడెం మండలంలోని మీది చింత, గండి గోపాల్​పూర్, ఇస్లాంపూర్ గ్రామాలు త్రీఫేజ్ కరెంట్ సరఫరా లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. చాలా ఏండ్ల క్రితం ఈ గ్రామాలకు సింగల్ ఫేజ్ కరెంటు సౌకర్యం కల్పించిన అధికారులు ఆ తర్వాత పెద్దగా దృష్టిపెట్టలేదు. అటవీ శాఖ రిజర్వ్ ఫారెస్ట్ నిబంధనల కారణంగా మొదట్లో విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయలేకపోయారు. ఆ తర్వాత కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలోకి ఈ ప్రాంతమంతా 

చేరుకోవడంతో త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించడం ఆ మారుమూల గ్రామాలకు అసాధ్యంగా మారింది. 

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

ప్రతి ఎన్నికల సమయంలో ఆ గ్రామాలకు వెళ్లే అన్ని పార్టీల నేతలు త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పిస్తామంటూ హామీలివ్వడమే తప్ప ఏనాడూ పరిష్కారం చూపలేదు. ఎన్నికల తర్వాత ఈ గ్రామాల వైపే నేతలు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆ మారుమూల గ్రామాల ప్రజలు తమకు త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. 

అటవీ శాఖ చొరవతో..

ఈ 16 గ్రామాల సమస్యను సీరియస్ గా తీసుకున్న అధికారులు అటవీశాఖతో పలుమార్లు చర్చించారు. త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఏర్పాటుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. తమ శాఖకు 20 ఎకరాల స్థలాన్ని ప్రత్యామ్నాయంగా ఇస్తే అనుమతులు జారీ చేసే అవకాశం ఉందని అటవీ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆ భూమిని కేటాయించేందుకు రెవెన్యూ శాఖ అంగీకరించింది. అయితే పరిపాలన, సాంకేతిక పరమైన ఆటంకాలు కలగకుండా అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది. అవరోధాలన్నీ తొలగిపో
గానే క్లియరెన్స్ జారీ చేయనుంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు ఈ 16 గ్రామాలకు త్రీఫేజ్ ​లైన్​ను ఏర్పాటు చేసి విద్యుత్ సౌక
ర్యాన్ని మెరుగుపరచనున్నారు. విద్యుత్ లైన్లకు సంబంధించి విద్యుత్ శాఖ రూపొందించిన ప్రతి పాదనలన్నింటికీ అటవీ శాఖ సానుకూలత వ్యక్తం చేయడంతో ఆ గ్రామాల విద్యుత్​సమస్య కొద్దిరోజుల్లోనే పరిష్కారం కానుందని అంతా భావిస్తున్నారు.