ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి
  • కడప జిల్లా పుల్లంపేటలో ఘటన

కడప:కడప జిల్లా పుల్లంపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకేసారి నీటికుంటలో మునిగి చనిపోయారు. హరిజనవాడకు సమీపంలో పెద్ద నీటి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సరదాగా ఈత కోసం ప్రయత్నించారు. లోతు తక్కువగా ఉందని ఈత కొట్టాలని భావించి దిగగా.. లోతు చాలా ఎక్కువగా ఉండడంతో నీట మునిగిపోతూ ఆర్తనాదాలు చేశారు. గుర్తించిన సమీపంలోని గ్రామస్తులు హుటాహుటిన నీటి కుంటవద్దకు చేరుకుని మునిగిపోతున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే ఎక్కువ నీటిని తాగేసి ఉన్న ఈ ముగ్గురు యువకులు ఒడ్డుకు చేర్చేలోగానే శ్వాసతీసుకోలేక కన్నుమూశారు. చనిపోయిన ముగ్గురు యువకులు ఇదే గ్రామానికి చెందిన శివకుమార్ (21), వెంకటాద్రి(21), రిషి (14) గా గుర్తించారు. లాక్ డౌన్ వేళ అందరూ ఇళ్ల వద్ద ఉంటున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో మృతుల తల్లిదండ్రులు, బంధు మిత్రులు కంటతడిపెట్టుకుని విలపించారు. ఘటనతో గ్రామంలో విషాదం ఏర్పడింది.