విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులకు విషాదం మిగిలింది. ఔరంగాబాద్‌లోని ఛత్రపతి షాహు మహారాజ్ వ్యవసాయ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు త్రయంబకేశ్వర్‌కు విహారయాత్ర కోసం వెళ్లగా.. అందులో ముగ్గురు విద్యార్థులు జలపాతంలో మునిగి చనిపోయారు. త్రయంబకేశ్వర్‌కు వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు విద్యార్థులు కోటిరెడ్డి, అనూషా, రఘువన్షిలు దుగర్వాడి జలపాతంపైకి ఎక్కాలని నిర్ణయించుకున్నారు. మిగతా ముగ్గురు తాము బస చేసిన హోటల్‌కి తిరిగి వెళ్లారు. వర్షాకాలంలో దుగర్వాడి జలపాతం అంత సురక్షితం కాదని స్థానికులు తెలిపారు. ఎందుకంటే ఇక్కడ నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరుగుతుంటాయి. కాగా.. మంగళవారం నీటి మట్టాలు తక్కువగా ఉండటంతో జలపాతంలో నీరు తక్కువగా ఉంది.
ఈ ఘటన గురించి త్రయంబకేశ్వర్ తహసీల్దార్ దీపక్ గిరాసే మాట్లాడుతూ.. ‘ఈ జలపాతాన్ని కోటి రెడ్డి ఇంతకుముందు రెండుసార్లు సందర్శించాడు. తన ఇద్దరు మిత్రులను సురక్షితంగా తిరిగి హోటల్‌కు తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో.. ముగ్గురూ కలిసి జలపాతంపైకి బయలుదేరారు. అయితే జలపాతం దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురూ సాయంత్రం వరకు హోటల్‌కు తిరిగి వెళ్లలేదు. దాంతో వారి స్నేహితులు.. మొదట ఫోన్‌లో వారిని సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ వారి ఫోన్లు ఏవీ కూడా అందుబాటులో లేనట్లు వచ్చింది. వెంటనే విద్యార్థులు జలపాతం దగ్గరికి వెళ్లిన తమ స్నేహితులను వెతుక్కుంటూ సమీప గ్రామానికి వెళ్లారు, కానీ అక్కడ వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. దాంతో చేసేది ఏమీ లేక వారంతా తిరిగి హోటల్‌కి చేరుకున్నారు.
మరుసటి రోజు ఉదయం ముగ్గురు విద్యార్థులు గ్రామస్థులను తీసుకొని జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో నీరు లేనప్పటికీ, జలపాతం అడుగున ఉన్న లోతైన కొలను ఉంది. అక్కడ అనూషా విరిగిన చెప్పులను గ్రామస్థులు చూశారు. వెంటనే కొలనులోకి దిగి వెతకగా.. అనూష మృతదేహం లభించింది. విద్యార్థుల ఫిర్యాదుతో.. అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోటి రెడ్డి, రఘువన్షి మృతదేహాలను కూడా కొలను నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని ఆయన తెలిపారు.
మరిన్ని వార్తలు…
