కొండగట్టు బస్సు ప్రమాదం: నేటికి మూడేళ్లు

కొండగట్టు బస్సు ప్రమాదం: నేటికి మూడేళ్లు

ఆ ప్రమాదకర క్షణాలు ఇంకా వారిని వీడలేదు. బస్సు ప్రమాద గాయాలు ఇంకా కండ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. కన్నవారిని, కట్టుకున్న వారిని, అయిన వారిని, ఆత్మీయులను దూరం చేసుకుని అప్పుడే మూడేళ్లు గడిచిపోయాయి. ఆ కన్నీళ్లు ఇంకా తడి ఆరలేదు. జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి ఇవాల్టికి సరిగ్గా మూడేళ్లు. మానని కొండగట్టు ప్రమాద గాయాలు,  జ్ఞాపకాలపై వీ6 స్పెషల్ స్టోరీ. 

సెప్టెంబర్ 11, 2018...కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 24 మంది ప్రాణాలు కోల్పోగా...మరో 41 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. మరికొంతమంది మంచానికే పరిమితమయ్యారు. ఈమె పేరు పల్లెర్ల సుజాత. జగిత్యచాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారం పేటకు చెందిన ఈమె బస్సు ప్రమాద బాధితురాలు. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరగడంతో పాటు చూపు కోల్పోయినంత పనైంది సుజాతకు. భర్త వదిలేసి వెళ్లడంతో వృద్ధులైన తల్లిదండ్రుల దగ్గరే జీవశ్చవంలా బతుకీడుస్తోంది. జగిత్యాల, కరీంనగర్ లో చికిత్సతో లాభం లేకపోవడంతో హైదరాబాద్ కాళ్లు, చేతులకు రాడ్స్ వేయించారు. ప్రస్తుతం పైకి బాగానే కనిపిస్తున్నా...సుజాతకు కనీసం కూర్చోవడం కూడా కష్ట సాధ్యంగా మారింది. ఇప్పటివరకూ సదరం సర్టిఫికెట్ కూడా రాకపోవడంతో పింఛన్ కూడా అందడం లేదు. పరిహారం పేరిట అందించిన డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకే పోయింది. ప్రతి నెలా రెండు వేలు మందులకు ఖర్చవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తనకు దిక్కెవరని మౌనంగా రోదిస్తోంది సుజాత.

ఇదిగో ఈమె పేరు గోలి లచ్చవ్వ. ఈమెది కూడా శనివారం పేట గ్రామమే. ఇప్పుడు లచ్చవ్వను ఇద్దరు కొడుకులు చూసుకుంటున్నారు. ప్రమాదంలో కాలు తీసేయడంతో ఇంటికే పరిమితమైంది. ఈమెకు కూడా సదరం సర్టిఫికెట్ లేదు. ప్రభుత్వం నుంచి పింఛన్ అందడం లేదు. డబ్బు తిమ్మాయపల్లికి చెందిన గడ్డం జలది కూడా ఇదే దీన స్థితి. స్టాండే జలకు ఆధారం. నాలుగు సార్లు కాళ్లకు సర్జరీలు చేయించినా లాభం లేకపోయింది. రాడ్స్ పడి నడవలేని స్థితిలో ఉన్న జలను కూడా సదరం సర్టిఫికెట్ కు అర్హురాలిగా గుర్తించలేదు అధికారులు. 

ఈమె పేరు లైశెట్టి శారద. ఈమెది డబ్బు తిమ్మాయపల్లె గ్రామమే. కాలేజికి వెళ్దామని బయలుదేరింది. ప్రమాదంలో శారద రెండు కాళ్లు, ఒక చేయి విరిగిపోయాయి. సర్జరీలు జరిగినా......తాను ఏ పని చేసుకోలేకపోతున్నానంటూ కన్నీరు పెట్టుకుంటుంది శారద. రేపు తనను ఎవరూ పెళ్లి చేసుకుంటారంటూ శారద అడిగిన తీరు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. డబ్బు తిమ్మాయపల్లె గ్రామానికె చెందిన గొల్కొండ విజయది మరో దీనగాథ. ఐదు నెలల గర్భిణి అయిన బిడ్డను తీసుకుని హాస్పిటల్ కు బయల్దేరింది. ప్రమాదంలో బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో  ఆ తల్లి తలుచుకుని ఎడవని రోజంటూ లేదు. ఘటన జరిగిన మరునాడు తెల్లవారితే వినాయక నిమజ్జనం. అందరూ నిమజ్జనం ఏర్పాట్లలో మునిగిపోయారు. ప్రమాదంలో ఆ ఊర్లన్ని ఘోల్లు మన్నాయి. ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయాయి. మళ్లీ వినాయక చవితి వచ్చింది. కానీ ఇళ్లలో పండగ వాతావరణం మాత్రం లేదు. ఆ ఘటనా వారి కళ్ల ముందు ఓ నెత్తుటి జ్ఞాపకంగా మిగిలిపోయింది.