తెలంగాణ అభివృద్ధికి మూడు జోన్లు

తెలంగాణ అభివృద్ధికి మూడు జోన్లు

 
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రభుత్వం బడ్జెట్​లో తెలిపింది. ఇందుకోసం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణయించామని వెల్లడించింది. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) లోపల ఉన్న హైదరాబాద్ నగరాన్ని అర్బన్ జోన్ గా.. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ జోన్​గా.. ట్రిపుల్ ఆర్ ఆవల ఉన్న ప్రాంతాన్ని రూరల్ జోన్ గా నిర్ధారించామని పేర్కొంది. ఈ జోన్లకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పింది. 

రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్.. 

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకూ పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తామని తెలిపింది. బడ్జెట్ లో మున్సిపల్ శాఖకు రూ.11,692 కోట్లు కేటాయించింది. 

‘‘రాష్ట్రానికి హైదరాబాద్ పాలన కేంద్రం మాత్రమే కాదు.. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులు అందించే గుండెకాయ. గత కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి ఫలితంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. రక్షణ రంగ సంస్థలు, ఫార్మా, ఐటీ లాంటి పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో, ఎయిర్​పోర్ట్​, ఓఆర్ఆర్ వరకు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. హైదరాబాద్ అభివృద్ధితో సృష్టించిన సంపద.. ప్రజలందరికీ చెందాలనేదే మా లక్ష్యం. అందుకే పాలనాపరంగా ప్రక్షాళన చేస్తున్నాం” అని బడ్జెట్​లో ప్రభుత్వం పేర్కొంది.