
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం రూపొందించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్ర పోషించగా త్రిష, అభిరామి హీరోయిన్స్. జూన్ 5న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ అభిమాన నటులు ఉంటారు. నాకు మాత్రం మంచి సినిమానే ఫ్యాన్. స్ట్రాంగ్ యాక్టర్స్, గ్రేట్ పెర్ఫార్మర్స్ ఇందులో ఉన్నారు. మణిరత్నం డైరెక్షన్ అందర్నీ సర్‌ప్రైజ్ చేసేలా ఉంటుంది. మా కాంబోలో వచ్చిన ‘నాయగన్’కు మించి ఉంటుంది. నా సినిమాల్లో ఇదే నా ఫేవరెట్.
ఇక నన్ను గురు అంటున్నారు... అలా అనొద్దు కానీ గుర్తు పెట్టుకోండి. నేను ఎప్పటికీ స్టూడెంట్‌నే. నేర్పడానికి సిద్ధంగా ఉండాలంటే నేను ఇంకా నేర్చుకోవాలి. మనం చేసే పని నుంచే స్టార్‌డమ్ వస్తుంది. స్టార్‌గా నేను పుట్టింది ఇక్కడే. తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. ఈ చిత్రం కూడా అందరినీ మెస్మరైజ్ చేస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
మణిరత్నం మాట్లాడుతూ ‘కమల్ సర్‌తో ‘నాయగన్’ తర్వాత చేసిన సినిమా ఇది. దాదాపు ముప్ఫై ఎనిమిదేళ్ల తర్వాత కలిసి చేసినా అదే ఫీలింగ్ కలిగింది’ అని చెప్పారు. శింబు మాట్లాడుతూ ‘నా కెరీర్ బిగినింగ్‌లో తెలుగు ఆడియెన్స్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రావడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
త్రిష మాట్లాడుతూ ‘కమల్ సర్‌తో నటించే అవకాశం రావడం బ్లెస్డ్‌గా భావిస్తున్నా. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు లవ్ యూ’ అని చెప్పింది. నటులు అభిరామి, తనికెళ్ల భరణి, నాజర్, అశోక్ సెల్వన్, సుహాసిని, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.