ఉరుములు, మెరుపులతో వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

 ఉరుములు, మెరుపులతో వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్ మెంట్. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు ఆఫీసర్లు. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందన్నారు. ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు.  ఇవాళ్టి నుంచి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశముందన్నారు.  

ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశముందన్నారు అధికారులు. 

శుక్రవారం హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ భారీ వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలి పురం, హయత్ నగర్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. వనస్థలిపురం, ఎల్బీనగర్ లో రోడ్లు జలమయమయ్యాయి. వరదనీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్లా జిల్లాలో భారీ వర్షం కురిసింది. వేములవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ గ్రామంలో వర్షానికి వాగు ప్రవాహంలో మతాబ్ సాబ్ అనే రైతు కొట్టుకుపోయాడు. వెదర్ ఆఫీసర్ల హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. వర్షాలకు నగరవాసులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లాల్లో వర్షాకాలం సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రైతులు.